ఫోర్జరీ జరిగినట్లు సీసీ విచారణలో తేలింది

by Taduka Kalyani |

మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో గ్రూపు సంఘాల మహిళల అనుమతి లేకుండానే బుక్‌కీపర్, సెకండ్ లీడర్ కలిసి రికార్డుల్లో ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని ఏ.పీ.ఎం పిడమర్తి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఫోర్జరీ జరిగినట్లు సీసీ విచారణలో తేలింది
X

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో గ్రూపు సంఘాల మహిళల అనుమతి లేకుండానే బుక్‌కీపర్, సెకండ్ లీడర్ కలిసి రికార్డుల్లో ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని ఏ.పీ.ఎం పిడమర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రమైన కారేపల్లి ఐకెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు, సీసీ పద్మకు విచారణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. సీసీ పద్మ నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. మహిళా సంఘ సభ్యుల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తున్నామని, వాస్తవాలను వెలికి తీసేందుకు సమగ్ర విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలిన వారిపై చట్ట పరిధిలో క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో శాఖాపరమైన చర్యలకూ కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సీసీ విచారణతో పాటు తాము కూడా నేరుగా గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని తెలిపారు. బాధిత మహిళల వాంగ్మూలాలు,సంఘ సభ్యుల రికార్డులు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించిన అనంతరం పూర్తి స్థాయి నివేదిక ను రూపొందిస్తామని చెప్పారు. గ్రూపు సంఘాల వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మహిళల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏ.పీ.ఎం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.

Next Story