- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలలు మూత : పట్టించుకోని అధికారులు
ప్రభుత్వం విద్యాభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, మండల పరిధిలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దిశ, చిన్నకోడూరు : ప్రభుత్వం విద్యాభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, మండల పరిధిలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామాల్లో ఆర్థికంగా కొంత మెరుగైన కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తగినంత మంది విద్యార్థులు లేకపోవడంతో పలు పాఠశాలలు మూతపడుతున్నాయి. గ్రామాల ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా చైతన్యపరచడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని సలేంద్రి, చేలకలపల్లి, పిట్టలవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. శంకరాయకుంట, తెరిసా నగర్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులను గోనపల్లి పాఠశాలకు అనుసంధానం చేశారు. అలాగే రామునిపట్ల హనుమాన్ నగర్ పాఠశాలను రామునిపట్ల పాఠశాలకు, చౌడారం ఎస్సీ కాలనీ పాఠశాలను చౌడారం పాఠశాలకు, ఇందిరానగర్ ఎస్సీ కాలనీ పాఠశాలను విట్లాపూర్ పాఠశాలకు అనుసంధానం చేశారు. గ్రామాల మధ్య రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఈఓ వివరణ
ఈ విషయం పై ఎంఈఓ పాశికంటి తిరుపతిను వివరణ కోరగా, అనుసంధానం చేసిన పాఠశాలల్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే విద్యార్థులు ఉండటంతో, వారి కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించడం సాధ్యం కాదని తెలిపారు. అందువల్లే విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప గ్రామాల ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేసినట్లు ఆయన వెల్లడించారు.






