రైతుల వ్యవసాయ పంట పొలాలను కబ్జా చేసిన గిరిజనులు

by Batti.Sumithra |

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రాంతంలో 209 సర్వే నంబరులో గల 120 ఎకరాల భూమిని స్థానికేతర గిరిజనులు ఆక్రమించుకోవడంతో భూ వివాదం తీవ్రరూపం దాల్చింది.

రైతుల వ్యవసాయ పంట పొలాలను కబ్జా చేసిన గిరిజనులు
X

దిశ, ఏటూరు నాగారం : ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రాంతంలో 209 సర్వే నంబరులో గల 120 ఎకరాల భూమిని స్థానికేతర గిరిజనులు ఆక్రమించుకోవడంతో భూ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటన పై స్థానిక గిరిజనేతర రైతులు మంగళవారం ఒక్కసారిగా ఉద్యమానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు రెండు గంటల పాటు పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట చోటుచేసుకోగా, చివరకు 144, 145 సెక్షన్ల అమలుకు దారి తీసింది. స్థానిక గిరిజనేతర రైతులు తమ తాతల కాలం నుంచి ఈ పంట పొలాలను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని చెబుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన గిరిజన కుటుంబాలు ఏటూరు నాగారానికి చెందిన కొందరు గిరిజనులతో కలిసి రాత్రికి రాత్రే ఈ 120 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు.

అప్పటి నుంచి వారు అక్కడే గుడారాలు వేసుకుని రాత్రింబవళ్లు ఉంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సంఘటన స్థలానికి చేరుకుని, ఈ భూములు తమవేనని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వేడుకున్నప్పటికీ గిరిజనులు వినిపించుకోలేదని తెలిపారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఎలాంటి ఆధారాలతో భూములను ఆక్రమించుకున్నారని గిరిజనులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన గిరిజన మహిళలు తమ వద్ద ఎలాంటి భూ పత్రాలు లేవని, కానీ చట్టాల ప్రకారం తమకు ఎక్కడైనా స్థలం ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకునే హక్కు ఉందని వాదించారు. దీని పై ఎస్సై మహేష్ స్పందిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ గిరిజనులు వెనక్కి తగ్గకుండా పొలాల్లో హద్దులు ఏర్పాటు చేసుకుని గుడిసెలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఈ పరిణామాలతో స్థానిక రైతులు, వ్యాపారులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు పార్టీలు, కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున మంగళవారం ఉద్యమానికి దిగారు. శాంతియుత ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఏఎస్పీ మనన్ భట్ ఐదు మండలాల ఎస్సైలు, సీఐలకు సమాచారం అందించి అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉద్యమం ఆగలేదు. వై జంక్షన్ వద్ద గిరిజనేతరులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన ఏఎస్పీ మనన్ భట్, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఉద్యమకారులను కోరారు. అయితే, గిరిజనులను వెంటనే పొలాల నుంచి ఖాళీ చేయించాలని, లేకపోతే తాము దేనికైనా సిద్ధమని రైతులు కొంతసేపు ధర్నా నిర్వహించారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై మహేష్ తహసీల్దార్‌ను సంఘటనా స్థలానికి రప్పించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ జగదీష్ పరిస్థితిని సమీక్షించి 144, 145, 163, 164 సెక్షన్లను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, భూముల్లో ఉన్న గిరిజనులను అక్కడి నుంచి తొలగించి, చట్టబద్ధంగా భూములను పరిశీలించి రైతులకు అప్పగిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం గిరిజనులను పొలాల నుంచి తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది. ఈ ఉద్యమంలో స్థానిక ప్రజలు, జేఏసీ నాయకులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పార్టీలు, కులాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story