ల్యాండ్ & సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్‌.. రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ACB

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-16 14:17:41  IST  )

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు

ల్యాండ్ & సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్‌.. రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ACB
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా నరహరి అవినీతి అక్రమాలపై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, ఈ రోజు ఆయన ఇల్లు, కార్యాలయాలతో పాటు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నరహరి కూడబెట్టిన భారీ అక్రమాస్తులు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు.

ఇంట్లోనే రూ.1.54 కోట్ల నగదు.. బ్యాంకులో రూ.కోట్లు

నరహరి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఏకంగా రూ.1.54 కోట్ల ప్యాక్ చేసిన నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా.. వాటిలో మరో రూ.2.29 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు వివిధ బ్యాంకుల్లో ఆయన పేరిట ఉన్న రూ.5 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) సైతం బయటపడ్డాయి. కేవలం నగదు, డిపాజిట్లే కాకుండా భారీగా బంగారం, వెండి ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నరహరి నివాసం నుంచి 1.3 కిలోల బంగారం, అలాగే 8 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే స్థాయిలో స్థిరాస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో ఒక జీ ప్లస్ 3 భవనాన్ని, నార్సింగిలో రెండు హైరైజ్ బిల్డింగ్స్‌ను, పుప్పాలగూడ, రాజేంద్ర‌నగర్ ప్రాంతాల్లో మరికొన్ని హైరైజ్ బిల్డింగ్స్‌ను నరహరి కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో వ్యవసాయ భూమి, అలాగే ఛత్రినాకలో ఒక జీ ప్లస్ 2 బిల్డింగ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ ఇళ్లు, ప్లాట్లు, భూములకు సంబంధించిన కీలక ఒరిజినల్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వాటన్నింటినీ అక్కడికక్కడే సీజ్ చేశారు. రహరి సంపాదనకు, దొరికిన ఆస్తులకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఈ అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story