- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనంతో ఆరిజన్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 'దిశ' దినపత్రిక ప్రచురించిన "ఆరిజన్ నయా దందా!" సంచలన కథనానికి విద్యాశాఖ అధికారులు మెరుపు వేగంతో స్పందించారు.

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 'దిశ' దినపత్రిక ప్రచురించిన "ఆరిజన్ నయా దందా!" సంచలన కథనానికి విద్యాశాఖ అధికారులు మెరుపు వేగంతో స్పందించారు. కార్పొరేట్ విద్యా సంస్థల ముసుగులో సాగుతున్న అక్రమాలను, అనుమతులు లేని 'ఆరిజన్ ఇంటర్నేషనల్ స్కూల్' అడ్డగోలు దోపిడీని సాక్ష్యాధారాలతో సహా 'దిశ' బహిర్గతం చేసింది. ఈ కథనం జిల్లా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేయడమే కాకుండా, విద్యాశాఖ అధికారుల్లో తక్షణ చలనాన్ని తెప్పించింది. 'దిశ' కథనం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ అర్బన్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనాయక్ మంగళవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.
పాఠశాల సీజ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:
అప్పన్నపల్లి పరిధిలో ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు, కనీస అనుమతులు లేకుండా నడుస్తున్న ఆరిజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణాన్ని, రికార్డులను ఎంఈఓ లక్ష్మీనాయక్ తక్షణమే సీజ్ చేశారు. నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, అమాయక తల్లిదండ్రుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా, వారిపై తెలంగాణ విద్యా చట్టం ప్రకారం.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అమాయక తల్లిదండ్రులను దోపిడీ నుంచి కాపాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు రక్షణగా నిలిచిన ఈ పోరాటం జిల్లావ్యాప్తంగా 'దిశ' విశ్వసనీయతను మరింత పెంచింది.ప్రజాపక్షాన నిలబడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడంలో 'దిశ' తన కలం పవర్‌తో ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.






