RBI: నెలకు రూ. 1.50 లక్షల స్టైపెండ్‌తో ఆర్‌బీఐ జాబ్ ఆఫర్

by S Gopi |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లైమేట్ చేంజ్ రిస్క్ వంటి అత్యంత డిమాండ్ ఉన్న 12 విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది.

RBI: నెలకు రూ. 1.50 లక్షల స్టైపెండ్‌తో ఆర్‌బీఐ జాబ్ ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సరికొత్త 'యంగ్ ప్రొఫెషనల్' (వైపీ) ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లైమేట్ చేంజ్ రిస్క్ వంటి అత్యంత డిమాండ్ ఉన్న 12 విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి ఇతర అలవెన్సులు లేకపోయినప్పటికీ, నెలకు ఏకంగా రూ. 1.50 లక్షల భారీ స్టైపెండ్‌ను ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. ముంబైలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయంలో ఈ నియామకాలు జరుగుతాయి. ఇది పూర్తిస్థాయి కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగం. ప్రారంభంలో మూడేళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ, ప్రతిభ ఆధారంగా దీనిని ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. దేశ అత్యున్నత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రత్యక్ష అనుభవం సంపాదించాలనుకునే దేశంలోని యువతకు ఇదొక అద్భుతమైన కెరీర్ లాంచ్ ఆఫర్.

ఎవరెవరు అర్హులు?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 21 నుంచి 30 ఏళ్ల లోపు (6 జూలై 2026 నాటికి) వయసున్న భారతీయ పౌరులు అర్హులని ఆర్‌బీఐ తెలిపింది. పోస్టులను బట్టి విద్యా అర్హతలు మారుతాయి. ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్ లేదా పబ్లిక్ పాలసీలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి.. అలాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసిన టెకీలకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) ఇందులో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. జూలై 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story