ప్రభుత్వ బడులకు బీఆర్ఎస్ అండ...

by Kodari Anjali |

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు.

ప్రభుత్వ బడులకు బీఆర్ఎస్ అండ...
X

దిశ, మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఆరుగురు విద్యావాలంటీర్లను నియమించి వారికి ప్రతి నెల వేతనాలు అందించేందుకు ముందుకు వచ్చారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కొత్త కిచెన్ షెడ్ నిర్మాణం, పీర్జాదిగూడ మరియు పర్వతాపూర్ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మేడిపల్లి, పీర్జాదిగూడ హైస్కూల్స్‌తో పాటు పర్వతాపూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలల సమస్యలను తెలుసుకున్నారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు..

అడ్మిషన్లు పెరుగుతున్నప్పటికీ సాంక్షన్ పోస్టులు లేక ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ప్రధానోపాధ్యాయులు వివరించారు. దీనిపై స్పందించిన జక్క వెంకట్ రెడ్డి మూడు పాఠశాలల్లో ఆరుగురు విద్యావాలంటీర్లను నియమించి వారి వేతనాలను బీఆర్ఎస్ నాయకులు భరిస్తారని హామీ ఇచ్చారు. విద్యావాలంటీర్ల నియామకం, కిచెన్ షెడ్ల నిర్మాణం మరియు మరమ్మతుల బాధ్యతలను మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్‌తో పాటు సీనియర్ నాయకులు ఆకుల మధుకర్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్ స్వచ్ఛందంగా స్వీకరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, యూత్ అధ్యక్షుడు ప్రభు, మైనారిటీ అధ్యక్షుడు జిలాని పాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story