జూలై 15 వరకు జర్నలిస్టుల అక్రెడిటేషన్ల గడువు పొడిగింపు

by Prasad Jukanti |   (  Updated:2026-06-16 12:43:12  IST  )

జీవో 252, 103 సవాల్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును జూలై 15 వరకు పొడిగించింది.

జూలై 15 వరకు జర్నలిస్టుల అక్రెడిటేషన్ల గడువు పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Journalist Accreditation Cards) గడువును 2026 జూలై 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌తో పాటు మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అక్రిడిటేషన్‌కు సంబంధించిన సౌకర్యాలను కొనసాగించాలని పిటిషనర్లు కోరగా.. వారి తరఫున అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్పెషల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ వైఖరిని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.

మరో నెల రోజులపాటు చెల్లుబాటు:

ప్రస్తుతం ఉన్న అన్ని అక్రిడిటేషన్ కార్డులు 2026 జూలై 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడంతో పాటు, అక్రిడిటేషన్‌కు అనుబంధంగా ఉన్న అన్ని సౌకర్యాలను కొనసాగించగలుగుతారు. వారి వృత్తిపరమైన బాధ్యతలకు ఆటంకం కలగకుండా ఈ ఉత్తర్వులు ఉపశమనం కల్పించాయి. ఇక తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ ఒక ఇంటర్‌లాక్యూటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. అక్రిడిటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులు, జారీ చేసిన కార్డులు, తిరస్కరించిన దరఖాస్తుల సంఖ్యతో పాటు వాటి తిరస్కరణకు గల కారణాలను కోర్టు ముందు ఉంచాలని ఆయన కోరారు. ఈ దరఖాస్తును తదుపరి విచారణలో పరిశీలించనుంది. హైకోర్టు నిర్ణయాన్ని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఘౌస్ మొహియుద్దీన్ స్వాగతించారు. ఇయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, శాశ్వత పరిష్కారం కోసం తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Next Story