Hailstones Alert: రైతన్నలూ పారాహుషార్..! రేపు ఆ జిల్లాల్లో వడగళ్లు పడే చాన్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ వాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Hailstones Alert: రైతన్నలూ పారాహుషార్..! రేపు ఆ జిల్లాల్లో వడగళ్లు పడే చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగిస్తూనే, మరోవైపు వడగళ్ల వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం సమయంలో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వడగళ్ల వాన పడే అవకాశం..

పలు జిల్లాల్లో పిడుగులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని.. ఆయా ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ, రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పగటిపూట ఎండ తీవ్రతతో పాటు, రాత్రి వేళల్లో విపరీతమైన ఉక్కపోత (Humidity) ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణమని, దీనివల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

Next Story