తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

by Kema Shiva Kumar |

వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల కదలికలు మందగించడంతో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల తాకిడి మరింత ఆలస్యం కానుంది.

తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కోట్లాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక మరింత ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకడంలో రుతుపవనాల కదలికలు మందగించడమే అందుకు కారణమని తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రాథమిక అంచనాల ప్రకారం జూన్ ప్రారంభంలోనే దేశంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు మరో 3 నుంచి 4 రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 5, 6 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికే కేరళను తాకాల్సిన ఈ రుతుపవనాలు, ఈసారి కదలికలు మందగించడంతో ఆలస్యంగా రానున్నాయి.

ఐఎండీ అంచనాలు తారుమారుకు కారణం..

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అసాధారణ వాతావరణ మార్పులు, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (Western Disturbance) నైరుతి రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం పూర్తిగా తొలగిపోతే గానీ రుతుపవనాల కదలికలు వేగవంతం కదలవని తెలుస్తోంది. మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో దేశంలోని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్ పనుల కోసం వర్షాలపైనే ఆధారపడే రైతులు.. విత్తనాలు వేసే సమయం దాటిపోతుండటంతో ఆకాశం వైపునకు చూస్తున్నారు.

Next Story