IMD:ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-09 11:45:52  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

IMD:ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలు ఉండగా.. సాయంత్రం వానలు పడుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వివరించింది. నేడు(శుక్రవారం) ఉత్తర తెలంగాణ మినహా మిగతా అన్ని జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన, మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 33 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. రేపు పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలలో వర్షాలు కరుస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ(శుక్రవారం) పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో మే 12 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. కొన్నిసార్లు గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లకు కూడా పెరుగుతుంది అని IMD అంచనా వేసింది. రేపు అల్లూరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం పేర్కొన్నారు. ఈ క్రమంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

Next Story