ఈ నెల 8న ‘భారత్ బంద్’

by  |
ఈ నెల 8న ‘భారత్ బంద్’
X

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న రైతులు నిరసనను ఉధృతం చేయడానికి నిర్ణయించారు. గురువారం జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోవడంతో.. ఈ నెల 8న ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో భేటీ అనంతరం రైతు సంఘాలు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సరిహద్దు సింఘులో రైతు నేత హర్విందర్ సింగ్ వెల్లడించారు. అదే రోజున దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పైనున్న టోల్ గేట్లను ముట్టడిస్తామని, టోల్ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయకుండా అడ్డుకుంటామని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. దేశరాజధాని ఢిల్లీకి చేరే ఇతర మార్గాలనూ దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. రైతులతో కేంద్రం ప్రభుత్వం గురువారం నాలుగో దఫా చర్చలు జరిపింది.

నూతన చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరించడానికి కేంద్రం సుముఖతను వ్యక్తపరచగా, మొత్తంగా చట్టాలను వెనక్కి తీసుకునేవరకు తమ ఆందోళన ఆగదని రైతు సంఘాలు పట్టుబట్టాయి. ఫలితంగా గురువారం నాటి చర్చల్లోనూ ప్రతిష్టంభన కొనసాగింది. నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. అదే రోజు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, కార్పొరేట్ కంపెనీల బొమ్మలను దహనం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. చట్టాలను సంపూర్ణంగా వెనక్కి తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, ఎలక్ట్రిసిటీ బిల్లు, పంట వ్యర్థాల దహనానికి జరిమానాల వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలనిచ్చిందని పంజాబ్‌కు చెందిన రైతు సంఘం జమూరి కిసాన్ సభా అధ్యక్షుడు సత్నామ్ సింగ్ అన్నారు.

కానీ, మూడు చట్టాలను మొత్తంగా వెనక్కి తీసుకోనంతకాలం తమ ఆందోళనలను ఆపబోమని స్పష్టం చేశారు. కాగా, రైతు ఆందోళనలకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతునిచ్చింది. రైతుతో మమతా బెనర్జీ ఫోన్‌లో మాట్లాడి అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. రైతులపై కేసులను ఎత్తి వేయాలని హర్యానాలో అధికార కూటమిలోని జేజేపీ డిమాండ్ చేసింది. వెంటనే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, రైతులపట్ల దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు.

ఆందోళనకారులను తొలగించాలని ‘సుప్రీం’లో పిటిషన్
చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దులో నిరసనలు చేస్తున్న రైతు ఆందోళనకారులను తొలగించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరిన సంగతి తెలిసిందే. అత్యవసర ఆరోగ్య సేవలు పొందడానికి ఈ ఆందోళనలు ఆటంకంగా మారాయని, ఇలా గుమిగూడటం వల్ల కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదమున్నదని అడ్వకేట్ ఓం ప్రకాశ్ పరిహార్ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. అందుకే ఢిల్లీ సరిహద్దులోని ఆందోళనకారులను తొలగించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.

రైతుల విన్నపాలు ఆలకించండి: కేంద్రానికి హీరో కార్తీ అభ్యర్థన
రైతుల విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ఆలకించి, సాగు చేసుకునే వారి హక్కును కాపాడాలని కోలీవుడ్ హీరో కార్తీ అభ్యర్థించారు. రైతుల డిమాండ్లను వెంటనే వినాలని, ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఆందోళనలు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. ఈ నిరసనల్లో మహిళల సంఖ్య భారీగా ఉన్నదని కేంద్రానికి రాసిన బహిరంగ లేఖలో వివరించారు.



Next Story