ఒకే గొడుగు కిందకు సాగునీటి విభాగాలు..!

by  |
ఒకే గొడుగు కిందకు సాగునీటి విభాగాలు..!
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో సాగునీటిపారుదల శాఖ మారిపోయింది. ఇక నుంచి అన్ని విభాగాలను కలుపుకుని జల వనరుల శాఖగా రూపాంతరం చెందింది. చిన్న తరహా, చెరువులు, కుంటలు, మధ్య తరహా సాగునీటి శాఖ, భారీ నీటిపారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. పలు మార్పులు, కొత్త పోస్టులతో జల వనరుల శాఖ ఏర్పాటైంది. దాదాపు మూడు నెలలుగా చేసిన ప్రతిపాదనలు మార్పులు, చేర్పుల అనంతరం సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. బుధవారం రాత్రి జల వనరుల శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలుపడంతో నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మార్పులతో పాటు జల వనరుల శాఖ అత్యవసర నిధిని ఇంజినీర్ల దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈఈ స్థాయి నుంచి ఈఎన్సీ వరకు అత్యవసర పనులకు కేటాయించే నిధులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ప్రతిపాదనల్లో డీఈ స్థాయి అధికారులకు నిధుల మంజూరీ అవకాశం కల్పించారు. మరోవైపు రెవెన్యూ శాఖ నుంచి వీఆర్వోలను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో అవసరాలకనుగుణంగా వినియోగించుకోనున్నారు. కార్యాలయ వ్యవహారాల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయనున్నట్లు చెప్పుతున్నారు. వీఆర్వోల్లో ఇంజినీరింగ్ విద్యను చదివి ఉంటే మాత్రం వారికి పనుల నిర్వహణలో విధులు అప్పగించనున్నారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలో ఉన్న కాల్వలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ఐడీసీ పథకాలు, చెరువులను దృష్టిలో పెట్టుకుని ఇంజినీర్లకు పని విభజన చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. ఒక్కో చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) పరిధిలో ప్రస్తుతం 10 నుంచి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కొందరు సీఈల పరిధిలో 2 నుంచి 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తాజాగా ఒక్కో సీఈ పరిధిలో 5 నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 సీఈ డివిజనల్​ కార్యాలయాలుండగా సంఖ్యను 19కి పెంచారు. ఇప్పటికే పంప్‌హౌస్‌ల నిర్వహణకు ఒక ఈఎన్‌సీని ప్రత్యేకంగా నియమించడంతో పాటు బేసిన్ల వారీగా కృష్ణా, గోదావరికి ఒక్కో సీఈని కొత్తగా నియమించినట్లు స్పష్టమైంది. దీంతో ఈ రెండు బేసిన్ల చెరువుల పర్యవేక్షణకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఉన్న మైనర్ ఇరిగేషన్ సీఈలు ఇక ఉండరు. జిల్లాలు, ప్రాదేశికాల వారీగా నిర్వహణ బాధ్యతలు చూసే సీఈలే అన్నీ పర్యవేక్షించనున్నారు.

అలాగే, ఇప్పటికే రెండు ఈఎన్సీ పోస్టులు ఉండగా, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ కొత్త పోస్టును రూపొందించారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న మరో మూడు ఈఎన్సీ పోస్టులు యథాతథంగా కొనసాగుతాయి. మొత్తంగా ఆరుగురు ఈఎన్సీలు జల వనరుల శాఖలో పని చేయనున్నారు. సీఈల సంఖ్యను పెంచినా అంతరాష్ట్ర విభాగం చీఫ్ ఇంజినీర్, హైడ్రాలజీ చీఫ్​ ఇంజినీర్ పోస్టులను తొలగించారు. హైదరాబాద్ స్థాయిలో సీడీఓ, వాలంతరి, క్వాలిటీ కంట్రోల్, సచివాలయం, ఎంక్వయిరీస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగాలతో పాటుగా క్షేత్రస్థాయిలో 19 మంది సీఈలు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

కొత్త పోస్టులు..

జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పోస్టులు రానున్నట్లు స్పష్టమైంది. బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ ఫైల్‌పై సంతకం చేయడంతో గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తామని, ఇరిగేషన్ శాఖలో అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి ప్రకటించారు. కొత్త పోస్టులతో పాటుగా వీఆర్వోలను కూడా సర్దుబాటు చేయనున్నారు.

ఇంజినీరింగ్ స్టాఫ్​ పోస్టుల్లో 618 పోస్టులను కొత్తగా చేయగా, వాటి సంఖ్య 3389 నుంచి 4007కి పెరిగింది. ఇతర అంశాల్లో స్టాఫ్ పోస్టులు మరో 327 పెంచుతున్నారు. ఎస్ఈలు 47 మందితో పాటు మరో పది మంది, ఈఈ పోస్టులు 206 ఉండగా ఇంకా 28, డీఈలు 678 మంది ఉండగా ఇంకా 214 కొత్త పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఈ పోస్టులు కొత్తగా 360 రానున్నాయి. నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ముగ్గురు ఈఎన్సీలు ఉండగా, మరో మూడు ఈఎన్సీలు కానున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం పరిధిలో ముగ్గురు సీఈలు ఈఎన్సీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఈఎన్సీలుగా వెళ్తే 19 సీఈలతో పాటుగా అదనంగా మూడు సీఈ పోస్టులు భర్తీ కానున్నాయి.

అత్యవసర నిధులు పెంపు..

ప్రాజెక్టుల పరిధిలో అత్యవసర పనుల నిమిత్తం ఇంజినీర్లకు ఉన్న నిధుల మంజూరీ అధికారాలను పెంచుతూ ప్రతిపాదనల్లో నిర్ణయించారు. ఇప్పటి వరకు డీఈ స్థాయి వరకు పనుల మంజూరీ అధికారాలు లేవు. తాజా ప్రతిపాదనల్లో వారిని కొత్తగా రూ. 2 లక్షల చొప్పున ఏడాదికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు మంజూరీ చేసుకునే వెసలుబాటు కల్పించారు. ఈఈ స్థాయిలో ప్రస్తుతం రూ. 40 వేల వరకు అధికారం ఉండగా దాన్ని రూ.5 లక్షల చొప్పున ఏడాదికి రూ.25 లక్షలు, ఎస్ఈకి రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున ఏడాదికి రూ.2 కోట్లు, సీఈలకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పరిమితితో ఏటా రూ.2 కోట్లు, ఈఎన్సీకి రూ.10 లక్షల నుంచి రూ.కోటి చొప్పున ఏటా రూ.25 కోట్లు అత్యవసర పనులను మంజూరు చేసే అధికారాన్ని కల్పించారు. అత్యవసర పనుల కోసం బడ్జెట్‌లో రూ.280 కోట్లు కేటాయించనున్నట్లు ప్రతిపాదనల్లో రూపొందించారు. ప్రతిపాదనలకు ఆమోదం రావడంతో నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.


Next Story

Most Viewed