నీటిపై తేలియాడుతున్న పడవలు.. మేఘాలయలో అద్భుతం!

by  |
నీటిపై తేలియాడుతున్న పడవలు.. మేఘాలయలో అద్భుతం!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పడవలు నదిలోని నీటిపై ప్రయాణిస్తుంటాయి. కానీ ఉంగోట్ నదిలో ప్రయాణించే పడవలు మాత్రం పై నుంచి చూస్తే గాలిలో తేలినట్లు కనిపిస్తాయి. ఎందుకంటారా..? ఆ నదిలోని నీరు అంత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుందన్న మాట. అందుకే నీటి అడుగున ఉన్న రాళ్లు, చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఉంగోట్ నదికి సంబంధించిన ఫొటోను జలశక్తి మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా స్పెషల్ బజ్ క్రియేట్ అయింది. ట్విట్టర్ వేదికగా చిత్రాన్ని పోస్టు చేసిన మినిస్ట్రీ.. ‘ప్రపంచంలోని పరిశుభ్రమైన నదుల్లో ఒకటి’గా ఉంగోట్‌ను పేర్కొంది.

ఉంగోట్ నది మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రత్యేకతల విషయానికొస్తే.. నదిలోని నీరు అత్యంత పరిశుభ్రంగా, పారదర్శకంగా ఉండి అద్దంలా మెరిసిపోతుంటుంది. ఇదే విషయాన్ని ప్రతిబింబించే ఫొటోను పోస్టు చేసిన మంత్రిత్వ శాఖ.. ఇండియాలోని నదులన్నీ ఇదే విధంగా క్లీన్‌గా మారిపోవాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా మేఘాలయ ప్రజానీకానికి హ్యాట్సాఫ్ తెలిపింది. ఇక ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా.. ‘అద్భుతమైన అనుభవం’ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘సహజ సౌందర్యానికి ప్రతీక’గా నిలుస్తున్న మేఘాలయ రాష్ట్రానికి ‘క్లీన్ అండ్ బ్యూటిఫుల్’ క్యాప్షన్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెబుతున్నారు. ఇక మేఘాలయ ప్రజలు సైతం తమ రాష్ట్ర సహజ వనరుల పట్ల బాధ్యతతో వ్యవహరించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడాన్ని ప్రశంసిస్తున్నారు.


Next Story

Most Viewed