కళాత్మకం.. బాంబూ టిఫిన్ బాక్స్

by  |
కళాత్మకం.. బాంబూ టిఫిన్ బాక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు మూగ జీవాల ప్రాణాలను బలిగొంటున్న ‘ప్లాస్టిక్’ రక్కసి.. మానవాళికి కూడా పెనుముప్పుగా తయారైంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్లాస్టిక్ నిషేధానికి’ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. కాగా, ఈ తరహా ఉత్పత్తుల్లో ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ విరివిగా లభిస్తున్నాయి. త్రిపురలోని ‘బాంబూ అండ్ కేన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(బీసీడీఐ)’ వెదురుతో విభిన్నమైన ప్రొడక్ట్స్ తయారుచేసేలా ప్రోత్సహిస్తోంది. ఇటీవలే అక్కడ రూపొందించిన ‘బాంబూ వాటర్ బాటిల్స్’ పర్యావరణ ప్రేమికుల మనసు దోచుకుంటుండగా.. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటి రవీనా టాండన్.. ఆ బాటిల్స్ కొనడంతో మరింత ఎక్కువ మందికి వాటి గురించి తెలిసింది. త్రిపుర ముఖ్యమంత్రి కూడా రవీనా టాండన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేయడమే కాక.. రవీనా జీ కొనడం వల్ల స్ఠానిక బాంబూ కళాకారులకు మరింత ఉత్సాహం వస్తుందని ట్వీట్ చేశారు కూడా. ఈ క్రమంలోనే తాజాగా ‘బాంబూ టిఫిన్ బాక్స్’ కూడా మార్కెట్‌లోకి రావడం విశేషం.

‘బాంబూ వాటర్ బాటిల్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ప్రధానంగా వాటి డిజైన్ సూపర్’ అంటూ బాంబూ బాటిల్స్ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసే.. బాలీవుడ్ నటి రవీనా వాటిని కొనుగోలు చేసింది. తాజాగా మరో ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్.. బాంబూతో తయారు చేసిన ‘లంచ్ బాక్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మణిపూర్‌కు చెందిన ఓ కంపెనీ వెదురు లంచ్ బాక్స్‌లను తయారు చేసింది. సుధా షేర్ చేసిన వీడియో కూడా నెటిజన్లను, పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

వావ్ వెదురు :

బొంగులో వెదురు అని తీసిపారేయకండి. వెదురు కలప.. స్టీలు కన్నా బలమైందిగా చెబుతుంటారు. అందుకే వెదురును ఉపయోగించి ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వంతెనలు కూడా కడతారు. సైకిళ్లు, స్నోబోర్డులు, స్కేట్ బోర్డులు కూడా తయారుచేస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు 1575 రకాలుండే వెదురులో.. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు వెదుళ్లు మాత్రం బాగా పెరుగుతాయి. ఒకటి అడవుల్లో పెరిగే ‘ముల్లం’. రెండోది ‘సాధనం’. అన్ని చెట్లతో పోలిస్తే ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేసేది బాంబూనే కావడం గమనార్హం.


Next Story

Most Viewed