- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Piyush Goyal: రాబోయే 10 నెలల్లో తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అమలు
వచ్చే ఏడాది మరో మూడు నుంచి నాలుగు కీలక ఒప్పందాలు కూడా కార్యరూపం దాల్చే అవకాశముందని ఆయన చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ ప్రపంచ వాణిజ్య, తయారీ రంగాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గత మూడేళ్లలో కుదిరిన తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) వచ్చే 10 నెలల్లో అమల్లోకి వస్తాయని, వచ్చే ఏడాది మరో మూడు నుంచి నాలుగు కీలక ఒప్పందాలు కూడా కార్యరూపం దాల్చే అవకాశముందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందాలు మొత్తం 38 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కవర్ చేస్తాయని, ఇవి భారత్‌తో పోటీ పడేవి కాకుండా దేశ వృద్ధికి తోడ్పడేవని గోయల్ పేర్కొన్నారు. ఒమన్‌తో ఎఫ్‌టీఏ ఇప్పటికే అమల్లోకి రాగా, మరో రెండు నుంచి మూడు ప్రధాన ఒప్పందాలు రాబోయే ఆరు నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ముంబైలో జరిగిన సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గోయల్, ప్రపంచ సరఫరా పునర్వ్యవస్థీకరణ దశలో ఉన్న ఈ సమయంలో భారత్ అత్యంత విశ్వసనీయ తయారీ, పెట్టుబడి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. దేశీయ మార్కెట్ విస్తరణ, యువత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్కరణలతో కూడిన పాలసీ వాతావరణం భారత్‌కు ప్రధాన బలాలుగా మారాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 100 ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి 3.5 బిలియన్ డాలర్ల(రూ. 33.5 వేల కోట్ల) ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తోందని, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలపై దాదాపు 130 బిలియన్ డాలర్ల(రూ. 12.43 లక్షల కోట్ల) పెట్టుబడులు కొనసాగుతున్నాయని వివరించారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.






