చైల్ట్ ట్రాఫికింగ్ పై వెంటనే స్పందించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

by Prasad Jukanti |

ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల ద్వారా జరుగుతున్న పిల్లల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

చైల్ట్ ట్రాఫికింగ్ పై వెంటనే స్పందించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:దేశంలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART), సరోగసీ కేంద్రాల ద్వారా పిల్లల అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫికింగ్) జరుగుతోందనే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ చైల్డ్ ట్రాఫికింగ్ దందా జరుగుతోందని ఈ సందర్భంగా అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ నివేదిక సమర్పించారు. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. 'పింకి వర్సెస్ ఉత్తరప్రదేశ్' చైల్డ్ ట్రాఫికింగ్ కేసు తీర్పు అమలును పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

'ఎగ్ డోనర్ల' పేరుతో అక్రమ రవాణా ముఠాలు

ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ అపర్ణా భట్ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఒక పిల్లల అక్రమ రవాణా కేసు దర్యాప్తులో.. నిందితులు తాము ఒక ఐవీఎఫ్ (IVF) కేంద్రంలో "ఎగ్ డోనర్లు" (అండదాతలు) అంటూ క్లెయిమ్ చేసుకున్నట్లు ఆమె కోర్టుకు తెలిపారు. ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల ద్వారా పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి దేశంలో ఎలాంటి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) లేకపోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. ఏఆర్టీ చట్టం, సరోగసీ చట్టం కింద బోర్డులు, మౌలిక వసతుల నియమాలు ఉన్నప్పటికీ.. పిల్లల అక్రమ రవాణా ముప్పును అడ్డుకునే నిర్దిష్ట నిబంధనలు వాటిలో లేవని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. పిల్లల కోసం ఈ కేంద్రాలను ఆశ్రయించే దంపతుల అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ నేరాలు జరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయడానికి కఠినమైన మార్గదర్శకాలు అవసరమని స్పష్టం చేశారు.

లక్షన్నర మంది పిల్లల జాడ లేదు:

అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలో దేశంలో చైల్డ్ ట్రాఫికింగ్ ట్రెండ్స్‌పై షాకింగ్ అంశాలు బయటపెట్టాయి. ఎన్‌సిఆర్‌బి (NCRB) డేటా ప్రకారం 2024లో దేశంలో 6 వేలకు పైగా ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తప్పిపోయిన పిల్లల కేసులు 7.8 శాతం పెరగగా.. ఇప్పటికీ 1.47 లక్షల మందికి పైగా పిల్లల గుర్తింపు లభించలేదుని పేర్కొంది. ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఐవీఎఫ్ నిపుణుడు, సీనియర్ పోలీస్ అధికారి, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ ప్రతిపాదించారు. ఈ కమిటీ ఫెర్టిలిటీ క్లినిక్‌లలో నేరాల నియంత్రణకు అవసరమైన ఎస్‌ఓపీ (SOP)లను రూపొందిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఒక కోఆర్డినేట్ బెంచ్ ఇలాంటి అంశాలపైనే విచారణ జరుపుతున్నందున, డూప్లికేషన్ లేకుండా ఈ వ్యవహారాన్ని కూడా ఆ కమిటీకే బదిలీ చేయవచ్చని ఆమె సూచించారు.

Next Story