నకిలీ హెచ్‌టీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

by Jakkula.Mamatha |

మండలంలో ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వైరా డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు టి.కరుణ శ్రీ పురుగుమందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు తగు సూచనలు చేశారు.

నకిలీ  హెచ్‌టీ  పత్తి విత్తనాలపై ఉక్కుపాదం
X

దిశ,ఏన్కూర్: మండలంలో ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వైరా డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు టి.కరుణ శ్రీ పురుగుమందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నకిలీ మరియు అక్రమ హెచ్‌టీ గ్లైసెల్ పత్తి విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధిక దిగుబడులు వస్తాయని ప్రచారం చేస్తూ కొందరు అక్రమ వ్యాపారులు రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం అనుమతి ఇవ్వని హెచ్‌టీ గ్లైసెల్ పత్తి విత్తనాల అమ్మకం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి విత్తనాలను వినియోగించడం వల్ల మొలక శాతం తగ్గడం, పంట ఎదుగుదల దెబ్బతినడం, కలుపు మందుల ప్రభావం సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.

రైతులు కేవలం లైసెన్స్ పొందిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తన ప్యాకెట్లపై కంపెనీ పేరు, లాట్ నెంబర్, గడువు తేదీ, మొలక శాతం మరియు ధృవీకరణ వివరాలను పరిశీలించాలని తెలిపారు. ఈ సందర్భంగా రేపల్లె వాడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఏ.డి.ఏ టి. కరుణ శ్రీ హాజరై రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామ నిఘా సమితి ఆధ్వర్యంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారులు సభ్యులుగా గ్రామ స్థాయిలో నకిలీ విత్తనాల విక్రయాలపై పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

గ్రామంలో ఎవరైనా నకిలీ లేదా అక్రమ హెచ్ టి గ్లైసెల్ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నకిలీ విత్తనాల విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ నిఘా సమితి సభ్యులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాలు, గోదాములు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే వ్యవసాయ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏన్కూరు మండల వ్యవసాయ అధికారి ఎ. నరసింహారావు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధుల, గ్రామ నిఘా సమితి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

Next Story