TG: పెరిగిన భూముల రేట్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. ఓఆర్ఆర్ పరిధిలో ఎకరం ఎంతంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-04 14:01:21  IST  )

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ.2.75 లక్షలుగా నిర్ణయించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు.

TG: పెరిగిన భూముల రేట్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. ఓఆర్ఆర్ పరిధిలో ఎకరం ఎంతంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ.2.75 లక్షలుగా నిర్ణయించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లలో ఎకరానికి రూ.5 లక్షలుగా, హెచ్ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలుగా, ఓఆర్ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే సమీక్షిస్తామన్నారు. సవరించిన భూముల విలువలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్సాప్ నెంబర్ 8247619983 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. గచ్చిబౌలి తాలిమ్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. అంతకు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. ఒక్క శాతం పెంచినా రూ.వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచనతో ప్రజా కోణంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను కుదించామన్నారు. తెలంగాణ ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.


నేను ఏ తప్పు చేయలేదు..

మంత్రుల శాఖల మార్పుపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి గారు స్పందిస్తూ “తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. దేవుడి దయతో ఇంతవరకు వచ్చాను. నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేస్తానన్నాని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసే వ్యక్తిని కాననన్నారు. ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదని, చట్ట ప్రకారం పని చేస్తున్నానని వివరించారు. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఏసీబీ ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారు. మూడు, నాలుగు సంవత్సరాల పాటు ఫైళ్లను తొక్కిపెట్టారన్నారు. తాను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేశానన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఎవర్ని క్షమించలేదు, ఉపేక్షించలేదన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు 10 సంవత్సరాలు గడిచినా కూడా ఆ నాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదు. అడిగిన సభ్యుల పదవీ కాలం కూడా ముగిసిందన్నారు. ఇటీవల అన్నీ ఫైళ్లను క్లియర్ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేదిత జాబితాలో పెట్టడం జరిగింది. భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ ను డిజిటలైజేషన్ చేస్తాం.

ఫ్యూచర్ సిటీ రద్దు కుదరదు..

ఫ్యూచర్ సిటీ రద్దు చేయడం సాధ్యం కాదని, ఫ్యూచర్ సిటీలో లాండ్స్ ఫ్రీ గా ఇవ్వడం లేదని మంత్రి పొంగులేటి ప్రకటించారు. రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. మొదటి దశలో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను, 13 క్లష్టర్‌లుగా విభ‌జించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక‌ భారం ప‌డ‌కుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధల‌తో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణంతో పాటు ఐదు సంవ‌త్సరాల నిర్వహణ బాధ్యత‌ను కూడా ఆ సంస్ధలకే అప్పగించాం. మూడు నుంచి ఐదు ఎక‌రాల స్ధలంలో కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్బిణీల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక వ‌స‌తులు, విశాల‌మైన వెయిటింగ్ ఏరియా మ‌హిళ‌ల కోసం ఫీడింగ్ రూమ్‌, చిన్నపిల్లల కోసం క్రెచ్‌, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవానలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించాం. ఈ గచ్చిబౌలి లో నిర్మిస్తున్న భావనాన్ని డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకోస్తాం. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. రెండో విడ‌త‌ జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామన్నారు.

Next Story