పిల్లల కోసం అక్టోబర్ వరకు ఆగాల్సిందే..

204
corona

దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. భారతదేశానికి చెందిన జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్-డి పేరుతో తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను 12 ఏళ్ల వయసు పైబడిన మైనర్ పిల్లలకు మూడు డోసులుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతి మంజూరు చేయడంతో అక్టోబరులోనే తెలంగాణలో సైతం అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తున్నది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ సిబ్బందిని ఉన్నతాధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్ర అవసరాలకు మొత్తం కోటిన్నర డోసులు అవసరమవుతుందని లెక్కలు వేసిన అధికారులు ఎంత మంది సిబ్బందిని ఈ అవసరం కోసం వినియోగించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ తెరుచుకున్నాయి. మరో వారం రోజుల్లో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా తెరుచుకోనున్నాయి. పిల్లలకు వైరస్ సోకుతుందనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు స్కూలుకు పంపడం లేదు. ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్ లేనందువల్ల వైరస్ బారిన పడతారనే ఆందోళన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉన్నది. ఈ పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వీలైనంత తొందరగా పంపిణీ చేయాలని భావిస్తున్నది. నీడిల్ లేకుండానే ఇంట్రా డెర్మల్ పద్ధతిలో వ్యాక్సిన్‌ను ఇవ్వనుండడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి పంపిణీ చేయవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేశారు.

రాష్ట్రంలో మొత్తం 48 లక్షల మంది పిల్లలు 12 ఏళ్ల పైబడినవారు ఉన్నారని జిల్లాల వారీగా అధికారులు లెక్కలు తీశారు. డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి వ్యాక్సిన్‌గా జైకోవ్-డి కి గుర్తింపు ఉన్నది. మొత్తం 28 రోజుల వ్యవధిలోనే మూడు డోసులనూ ఇచ్చేయవచ్చని వైద్యాధికారులు తెలిపారు. సూది భయం లేనందువల్ల చిన్నారులు మారం పెట్టే అవకాశమే లేదన్నారు. జిల్లాలవారీగా అర్హులైన పిల్లల సంఖ్య, అవసరమయ్యే సిబ్బంది, కోటిన్నర డోసులు రావడానికి పట్టే సమయం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అందుబాటులోకి వచ్చిన ఒకటి, రెండు నెలల వ్యవధిలోనే మొత్తం చిన్నారులకు టీకాలు ఇవ్వవచ్చనే అభిప్రాయానికి వచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..