ఓటు బ్యాంకే లక్ష్యం.. కులాల ఓట్లపై ఫోకస్

by  |
ఓటు బ్యాంకే లక్ష్యం.. కులాల ఓట్లపై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కులాలవారీ ఓటర్లపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఓట్లు గంపగుత్తుగా పడేలా కార్యాచరణ ప్రారంభించింది. దుబ్బాక, నాగార్జునసార్ లాంటి అన్ని ఎన్నికల్లోనూ ఇది సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు హుజూరాబాద్‌లో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది. ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు, నేతలను రంగంలోకి దింపి వారికి బాధ్యతలను అప్పగించింది. ఆ ప్రకారమే విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నది.

ఆయా సామాజిక వర్గాల సంఘాల ప్రతినిధులతో రహస్యంగా మంతనాలు, భేటీలతో నేతలు తనమునకలయ్యారు. తాయిలాలు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రతినిధులే చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు ఓట్లు గంపగుత్తగా పడేలా పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ విజయమే లక్ష్యంగా పెట్టుకుని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతి ఓటరునూ కలిసేలా ప్రణాళికలు రూపొందించింది పార్టీ నాయకత్వం. గ్రామస్థాయిలో బూత్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. కులాలవారీ ఓటర్ల వివరాలు సేకరణ జరుగుతున్నది. సంక్షేమం, అభివృద్ధిని పార్టీ స్థానిక నేతలు వివరిస్తున్నారు. కులాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో తాజాగా రూపొందిన జాబితా ప్రకారం మొత్తం 2,26,590 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 22,600 మంది, మున్నూరు కావు ఓటర్లు 29,100, పద్మశాలి 26,350, గౌడ 24,200, ముదిరాజ్ 23,220, యాదవ 22,150, మాల 11,100, మాదిగ 35,600, ఎస్టీలు 4,220, నాయీ బ్రాహ్మణ -3300, రజక 7,600, మైనార్టీ 5,100, ఇతరులు 12,050 మంది చొప్పున ఓటర్లుగా ఉన్నారు. కులాలవారీగా ఓటర్ల వివరాలను సేకరించిన టీఆర్ఎస్ అధినేత ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు, నేతలను రంగంలోకి దింపారు.

దీనికి తోడు దళిత ఓటర్లను ఆకర్షించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ ప్రచారం చేస్తున్నారు. గిరిజనుల ఓట్ల కోసం మంత్రి సత్యవతి రాథోడ్, గీత కార్మికుల ఓట్ల కోసం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు కౌశిక్ రెడ్డి, కశ్యప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదవుల ఓట్లను ఆకట్టుకునేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మశాలీలను తమవైపునకు తిప్పుకునేందుకు మాజీ మంత్రి ఎల్.రమణను రంగంలోకి దింపింది. ముస్లింఓట్ల కోసం మంత్రి మహమూద్ అలీకి బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటికే యాదవులకు మరింత దగ్గరయ్యేందుకు రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టగా, దళితుల సంక్షేమం కోసం చేపట్టబోయే దళితబంధును తెరపైకి తెచ్చారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed