బేగంబజార్‌లో కరోనా కలకలం.. షాపులు బంద్

by  |
బేగంబజార్‌లో కరోనా కలకలం.. షాపులు బంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని బేగం బజార్ మార్కెట్‌లోని కిరాణా దుకాణాలు సాయంత్రం ఐదు గంటలకే బంద్ కానున్నాయి. శుక్రవారం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఎప్పటివరకు ఈ ఆంక్షలను కొనసాగించాలనేది కరోనా పరిస్థితులు కంట్రోల్ అయ్యే అంశంపై ఆధారపడి ఉంటుందని వ్యాపారస్తులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని.. బేగం బజార్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘నో మాస్క్.. నో ఎంట్రీ’ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దుకాణానికి వచ్చే వినియోగదారులు మాత్రమే కాక పనిచేసే సిబ్బంది కూడా విధిగా మాస్కు ధరించాల్సిందేనని, సంఘం తీసుకున్న నిర్ణయంగా అర్థం చేయించాలని ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ గుప్త ‘దిశ’కు తెలిపారు. మాస్కు లేకుండా వచ్చినట్లయితే వినియోగదారులకు ఉచితంగానే అందజేయాలని కూడా అసోసియేషన్ నిర్ణయించింది.

గతేడాది కరోనా కట్టడిలో తమ సంఘం పోషించిన బాధ్యతాయుతమైన పాత్రను ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు వివరించారు. నగరంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందని, అందువల్లనే కంట్రోల్ అయ్యేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఫలానా తేదీ వరకు అనే నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం అదేనని వివరించారు. బేగం బజార్ పరిధిలోని కిరాణా దుకాణాల సంఘం మాత్రమే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నదని, మిగిలిన సంఘాలు కూడా ఇదే తరహాలో బాధ్యతతో ఆలోచిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు క్షేమంగా, భద్రంగా ఉంటేనే వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు సాధ్యమవుతాయని, అందువల్లనే ఈ నిర్ణయాన్ని తమ సంఘం ప్రత్యేకంగా సమావేశమై తీసుకున్నదని వివరించారు.



Next Story