ఎస్‌బీఐతో వొడాఫోన్ ఐడియా చర్చలు.. ఫలిస్తాయా..!

by  |
ఎస్‌బీఐతో వొడాఫోన్ ఐడియా చర్చలు.. ఫలిస్తాయా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో కొత్త అప్పుల కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎస్‌బీఐ కొత్త రుణం ఇవ్వగలిగితే మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తాయని, తద్వారా పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని వొడాఫోన్ ఐడియా భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి ముందుగా వొడాఫోన్ ఐడియా తిరిగి పుంజుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని ఎస్‌బీఐ కోరిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

వొడాఫోన్ ఐడియాకు ఉన్న ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలకు చెందిన సమగ్ర ప్రణాళికను సమర్పించాలని, ఇందులో కంపెనీ నగదు భద్రత ప్రణాళిక, తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్, అతిపెద్ద వాటాదారుల నుంచి ఈక్విటీ పెట్టుబడులు, టారిఫ్ ఔట్‌లుక్ వంటి కీలక వివరాలను ఇవ్వాలని ఎస్‌బీఐ కోరినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి వొడాఫోన్ ఐడియా చర్చలు కొనసాగుతున్నాయని, ఎస్‌బీఐ నుంచి నిధులు వస్తాయో లేదో ఖచ్చితంగా తెలియదని బ్లూమ్‌బర్గ్ వివరించింది.

కాగా 2016లో రిలయన్స్ జియో ప్రారంభమైనప్పటి నుంచి వొడాఫోన్ ఐడియా వార్షిక లాభాలను నివేదించలేదు. ఎప్పటికప్పుడు సబ్‌స్రైబర్లను కోల్పోతూనే ఉంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎమ్ ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం.. జూన్ చివరి నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం అప్పులు రూ.1.9 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వానికే రూ.1.68 లక్షల కోట్లు, మిగిలిన మొత్తం ఇతర బకాయిలు ఉన్నాయి.


Next Story

Most Viewed