- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాగజ్‌నగర్‌లో కలెక్టర్ మెరుపు దాడులు..
జిల్లాలో అక్రమార్కుల ఆటలకు కాలం చెల్లింది. చట్టాన్ని చుట్టం చూపుగా చూస్తూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే వారిపై జిల్లా కలెక్టర్ కె. హరిత ఉక్కుపాదం మోపారు.

దిశ, కాగజ్‌నగర్: జిల్లాలో అక్రమార్కుల ఆటలకు కాలం చెల్లింది. చట్టాన్ని చుట్టం చూపుగా చూస్తూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే వారిపై జిల్లా కలెక్టర్ కె. హరిత ఉక్కుపాదం మోపారు. గురువారం కాగజ్‌నగర్ పురపాలికతో పాటు మండల పరిధిలో కలెక్టర్ హరిత జరిపిన సుడిగాలి పర్యటన, మెరుపు తనిఖీలు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం సృష్టించాయి. అటు పట్టణాన్ని మురికి కూపంగా మార్చే వ్యాపారులకు, ఇటు ప్రభుత్వ సంపదను దోచుకునే మట్టి మాఫియాకు కలెక్టర్ తన లైవ్ యాక్షన్ తో మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. కాగజ్‌నగర్ పట్టణాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ చౌక్ నుండి తిరంధాస్ టాకీస్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై కలెక్టర్ అధికారులతో కలిసి స్వయంగా నడుస్తూ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని గురుకృప టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వాడిన మురికి నీటిని, తిన్న ఎంగిలి ప్లేట్లను బహిరంగంగా రోడ్డుపై పారబోస్తూ కలెక్టర్ కంటపడ్డారు.
ప్రజల ఆరోగ్యం తో ఆటలాడుతూ, రోడ్లను అపరిశుభ్రం చేస్తున్న సదరు హోటల్ యాజమాన్యంపై కలెక్టర్ నిప్పులు గరిగారు. వ్యాపారం చేసుకుంటూ సమాజానికి రోగాలు పంచుతారా..? అంటూ స్పాట్‌లోనే మున్సిపల్ కమిషనర్ తిరుపతిని పిలిచి భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను రోడ్లపై వేస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవు. రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలే కాదు.. షాపులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా పెడతామన్నారు. పట్టణ తనిఖీలు ముగించుకుని కలెక్టర్ మండలం లోని గన్నారం, 3 నెంబర్, ఆరెగూడ, అనుకొడ గ్రామాల్లోని చెరువుల పరిశీలనకు వెళ్లారు. కాగా, నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12 పరిధిలో అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కలెక్టర్ కాన్వాయ్ అడ్డుకుంది.
కలెక్టర్‌ను స్వయంగా చూసిన మట్టి రవాణాదారులు భయంతో వణికిపోయారు. వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు కానీ, కనీస పత్రాలు కానీ లేవని తేలింది. దీంతో కలెక్టర్ ఏమాత్రం ఉపేక్షించకుండా.. ఆ మూడు ట్రాక్టర్లను తక్షణమే సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తీసుకున్న ఈ శరవేగపు నిర్ణయంతో నియోజకవర్గంలోని ఇసుక, మట్టి అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, అనుమతులు లేకుండా సహజ వనరులైన ఇసుక, మట్టిని తరలిస్తే వాహనాలను శాశ్వతంగా జప్తు చేస్తామని హెచ్చరించారు. రవాణా చేపట్టే ముందు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుండి అనుమతి పత్రాలు పొందాలని, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ మెరుపు తనిఖీలలో కాగజ్‌నగర్ మండల తహసీల్దార్ మధుకర్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






