పర్యావరణ పరిరక్షణలో నర్సింగాపూర్ రైతు ఆదర్శం

by Jakkula.Mamatha |

పంట అవశేషాలను తగులబెట్టి పర్యావరణానికి కీడు చేసే ప్రస్తుత రోజుల్లో.. హుజూరాబాద్ పట్టణంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

పర్యావరణ పరిరక్షణలో నర్సింగాపూర్ రైతు ఆదర్శం
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: పంట అవశేషాలను తగులబెట్టి పర్యావరణానికి కీడు చేసే ప్రస్తుత రోజుల్లో.. హుజూరాబాద్ పట్టణంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు. హుజూరాబాద్ పట్టణంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో రైతు గూడూరి స్వామి రెడ్డి తన పొలంలో రోటరీ మల్చర్ సహాయంతో పంట అవశేషాలను విజయవంతంగా భూమిలో కలియదున్నారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ వ్యవసాయ సంచాలకులు జి. సునీత ముఖ్య అతిథిగా హాజరై, రైతు స్వామి రెడ్డి చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పంట అవశేషాల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.

కలియదున్నడంతోనే నేలకు జీవం:ఏడీఏ సునీత

​ఈ సందర్భంగా ఏడీఏ సునీత మాట్లాడుతూ.. పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నడం వల్ల రైతుకు, నేలకు చేకూరే బహుళ ప్రయోజనాలను వివరించారు.పంట అవశేషాలు భూమిలో కుళ్ళిపోవడం వల్ల హ్యూమస్‌గా మారి సేంద్రియ కార్బన్ పెరుగుతుంది. తద్వారా నేల అత్యంత సారవంతంగా మారుతుంది. మొక్కలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషియం,వంటి ప్రధాన పోషకాలు తిరిగి నేలకే దక్కుతాయి. నేల పొరలు మెత్తబడి గాలి ప్రసరణ పెరుగుతుంది. ఇది వేర్ల వ్యవస్థ బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

​ భూమి ఎక్కువ రోజులు తేమను పట్టి ఉంచడం వల్ల, పంటకు నీటి అవసరం కొంత వరకు తగ్గుతుంది. నేలలో మేలు చేసే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవశేషాలు నేలపై కప్పులా ఏర్పడటం వల్ల గాలి, వర్షాల వల్ల పైపొర కొట్టుకుపోకుండా రక్షణ లభిస్తుంది. అని ఏడీఏ సునీత తెలిపారు. ఈ పద్ధతుల ద్వారా దీర్ఘకాలంలో పంట దిగుబడులు స్థిరంగా ఉంటూ, రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

అవశేషాల దహనం.. స్వయంకృతాపరాధమే!

​పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఏ డి ఏ హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల నత్రజని, గంధకం వంటి పోషకాలు పొగ రూపంలో గాల్లో కలిసిపోతాయని, అధిక ఉష్ణోగ్రతలకు నేలలోని శ్రేయోదాయకం సూక్ష్మజీవులు నశించి భూమి నిస్సారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, దీనివల్ల వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల శ్వాసకోశ వ్యాధులు, కంటి మంటలు వస్తాయని, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారంతో వాతావరణ మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మంటలు పక్క పొలాలకు వ్యాపించే ముప్పు కూడా ఉందని హెచ్చరించారు.

​పెద్ద సంఖ్యలో హాజరైన రైతాంగం..

​ఆధునిక యంత్రాల వినియోగం పై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిల్ కుమార్, ప్రదర్శన చేసిన రైతు గూడూరు స్వామి రెడ్డితో పాటు స్థానిక రైతులు దండ వెంకట రమణారెడ్డి, గూడూరి మల్లారెడ్డి, బండి సమ్మయ్య, గూడూరి చైతన్య రెడ్డి, గూడూరి లక్ష్మారెడ్డి, చెవుల సమ్మయ్య, కాటిపల్లి కిషన్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతు స్వామి రెడ్డి చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకుని, మండలంలోని మిగతా రైతులు కూడా పంట అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని అధికారులు పిలుపునిచ్చారు.

Next Story