కోడలే కొడుకైన వేళ.. కరోనా సోకిన మామను రోజంతా మోసుకెళ్లిన వైనం..!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు బంధాలు, బంధుత్వాలు, మానవత్వం అనేవి ఒక్కసారిగా చెల్లాచెదురైపోయాయి. కరోనా వచ్చిందని సొంతింటి వాళ్లే దూరంగా నెట్టివేసిన రోజులు కళ్లముందు కదలాడాయి. అయితే, తన మామయ్యకు కరోనా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేయకపోవడంతో కోడలు మామను వీపుపై మోసుకెళ్లిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని నాగాన్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకివెళితే.. నాగాన్ రాహాకు చెందిన 24 ఏళ్ల నిహారికా దాస్ ఎవరూ చేయని సాహసాన్ని చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. నిహారికా యొక్క మామ తులేశ్వర్ దాస్ (75)ఏళ్లు భాటిగావ్ గ్రామంలో బెట్టు గింజ అమ్మకందారుడు. ఇటీవల ఈయన కరోనా బారిన పడ్డాడు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొడుకు పనిమీద సిలిగిరి వెళ్లాడు. వీరు నివసించే ప్రాంతంలో వాహన రాకపోకలకు రోడ్డు మార్గం కూడా లేదు. 2 కిలోమీటర్ల దూరంలోని రాహా పట్టణంలో ఉన్న సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లడానికి కోడలు ఆటో రిక్షాను ఏర్పాటు చేసింది. అయితే, నేరుగా ఆటోరిక్షా వారి ఇంటి ముందుకు రాలేదు. కొద్ది దూరంలోనే డ్రైవర్ నిలిపివేశాడు. కారణం రోడ్డు మార్గం లేకపోవడమే. తులేశ్వర్ దాస్ చాలా బలహీనంగా ఉండటంతో ఆటో వద్దకు నడుస్తూ వెళ్లలేకపోయాడు.

దీంతో కోడలు తన మామను వీపుపై కొద్ది దూరం వరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించి హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అతని పరిస్థితి తీవ్రంగా ఉన్నందున నాగావ్‌లోని 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో మరొక ప్రైవేట్ వాహనంలో మామను కొవిడ్ సెంటర్ కు తీసుకెళ్లేందుకు సిద్ధపడింది కోడలు. అంబులెన్స్ లేదా స్ట్రెచర్ లేకపోవడంతో మళ్లీ ఎత్తుకుని వాహనం దగ్గరకు తీసుకెళ్లింది. తాను చేస్తున్న పనిని అందరూ చూస్తున్నారే కానీ సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కసారిగా ఆ సమయంలో ‘‘నేను ముక్కలయ్యాను.. ఓపిక నశించింది. ఆ రోజు అంతా మామను మోస్తునే ఉండటంతో శక్తి సరిపోలేదని’’ నిహారిక పేర్కొంది. ఆమె మామను వీపుపై మోస్తున్న సమయంలో అక్కడి లోకల్ పీపుల్ ఫోటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో తెగ వైరల్ అయ్యాయి. కాగా, ఈ దృశ్యాలను ఎవరూ చూడకూడదని నిహారికా కోరుకుంటున్నట్లు సమాచారం.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed