ముందే రైతు సంఘాలతో చర్చిస్తే బాగుండేది: వినోద్‌కుమార్

by  |
ముందే రైతు సంఘాలతో చర్చిస్తే బాగుండేది: వినోద్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే ముందు బిల్లులను రూపొందించే దశలోనే రైతులతో, రైతు సంఘాలతో, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయీసంఘంతో చర్చలు జరిపి ఉంటే బాగుండేదని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలను తీసుకురావడం మంచిదే అయినా రైతుల ప్రయోజనాల విషయంలో స్వయంగా వారితోనే సంప్రదింపులు జరిపి అవగాహన కలిగించి, అర్థం చేయించి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు. ప్లానింగ్ కమిషన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థలు గురువారం సంయుక్తగా నిర్వహించిన వెబినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నారని, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వినోద్ కుమార్ గుర్తుచేశారు. రైతులతో జరిగిన చర్చల క్రమంలో వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తగిన సవరణలు చేయాలన్నారు. కనీస గిట్టుబాటు ధరపై స్వయంగా ప్రధానే సానుకూలంగా స్పందించినందున ఆ మేరకు చట్టాల్లో సవరణలు చేయడం మంచిదన్నారు.

ఈ వెబినార్‌లో ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర, కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ సురేంద్రనాధ్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.



Next Story

Most Viewed