గుజరాత్‌లో సరికొత్త పర్యావరణ విప్లవం.. ‘డ్రమ్ ప్లాంటేషన్’ టెక్నాలజీ అదుర్స్

by Kema Shiva Kumar |

వినూత్న 'డ్రమ్ ప్లాంటేషన్' టెక్నాలజీతో చవిటి బంజరు భూములను పచ్చటి నందనవనంగా గుజరాత్ అటవీ శాఖ మార్చేసింది.

గుజరాత్‌లో సరికొత్త పర్యావరణ విప్లవం.. ‘డ్రమ్ ప్లాంటేషన్’ టెక్నాలజీ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రం సవాళ్లను సైతం ఎదుర్కొంటూ అసాధ్యాన్ని.. సుసాధ్యం చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సరికొత్త సెమికండక్టర్ హబ్‌గా ఎదుగుతున్న ధోలేరా (Dholera)లో ఓ వినూత్న ప్రయోగం విజయవంతమైంది. అక్కడ ఎందుకూ పనికిరాదనుకున్న చవిటి (ఉప్పు) భూములను ‘డ్రమ్ ప్లాంటేషన్’ (Drum Plantation) టెక్నాలజీతో పచ్చటి పర్యావరణ ప్రాంతంగా గుజరాత్ అటవీ శాఖ మార్చేసింది. అయితే, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, 15 రకాలకు చెందిన 3,200కి పైగా మొక్కలు ఇప్పుడు అక్కడ ఏపుగా పెరుగుతున్నాయి. ‘ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (DSIRDA) సపోర్టుతో గుజరాత్ అటవీ శాఖ ఈ అద్భుత ప్రాజెక్టును అమలు చేసింది. పారిశ్రామిక అభివృద్ధిని సాధిస్తూనే, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ ప్రయోగం ఒక నిదర్శనంగా నిలిచింది.

సవాలును జయించిన ‘డ్రమ్ ప్లాంటేషన్’

సెమి కండక్టర్ పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తున్న ధోలేరాలో తీవ్రమైన ఎండలు, నేలలో విపరీతమైన ఉప్పు శాతం కారణంగా మొక్కలు పెంచడం అసాధ్యంగా మారింది. దీనిని అధిగమించడానికి అటవీ శాఖ ‘డ్రమ్ ప్లాంటేషన్’ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్లకు చవిటి నేల తగలకుండా, స్పెషల్‌గా తయారు చేసిన డ్రమ్ములలో సారవంతమైన మట్టిని నింపి మొక్కలను నాటారు. ఫలితంగా, అత్యంత కఠిన వాతావరణంలోనూ విభిన్న జాతుల మొక్కలు ఇక్కడ ప్రాణం పోసుకున్నాయి. భారీ పారిశ్రామికీకరణ (Industrialization) జరుగుతున్న తరుణంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.


Next Story