మేడిప‌ల్లిలో ఇళ్ల స్థ‌లాల‌కై గ్రామ‌స్తుల పోరాటం

by  |
మేడిప‌ల్లిలో ఇళ్ల స్థ‌లాల‌కై గ్రామ‌స్తుల పోరాటం
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఇళ్ల స్థ‌లాల కోసం పేద‌లు భూ పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. గ్రామ‌కంఠం భూమిని పేద‌ల‌కు పంచాల‌ని, గుడిసెలు వేసుకున్న ఘ‌ట‌న ఆదివారం రోజున‌ యాచారం మండ‌లం మేడిప‌ల్లిలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే… న‌క్క‌ర్త మేడిప‌ల్లి గ్రామంలో సుమారు ఎక‌రం పైనున్న‌ గ్రామ‌కంఠం భూమిని కొట్టేయ‌డానికి ద‌ళారులు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు ప‌న్నాగం ప‌న్నారు. భూమి చుట్టూ పెన్సింగ్ వేశారు. ఇది తెలుసుకున్న గ్రామ‌స్తులు.. సీపీఎం నేత‌ల ఆధ్వ‌ర్యంలో మూకుమ్మ‌డిగా భూమిలోకి వెళ్లి చ‌దునుచేసి గుడిసెలు వేశారు. భూమి చుట్టూ హ‌ద్దురాళ్లు పాతారు.

పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఆందోళ‌న‌కారుల‌కు, సీపీఎం నేత‌ల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఏదైనా ఉంటే చ‌ట్ట‌ప‌రంగా ముందుకెళ్లాల‌ని ఆందోళ‌న‌కారుల‌కు పోలీసులు సూచించారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం నేత‌లు మాట్లాడుతూ.. క‌బ్జాదారుల నుంచి భూమిని కాపాడి ఇళ్లులేని పేద‌ల‌కు స్థ‌లాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. గ్రామ‌కంఠం భూమిని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విడిపించాల‌ని డిమాండ్ చేశారు. క‌బ్జా చేసిన‌వారిని క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. స‌ర్పంచ్‌, గ్రామ పెద్ద‌లు మాట్లాడుతూ ఇళ్లు లేనివారికి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. న‌క్క‌ర్త‌ మేడిపల్లిలోని గ్రామకంఠం భూమిని సర్వే చేయించి, పేద‌ల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తామ‌న్నారు.


Next Story

Most Viewed