- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా పుకార్ల వేట.. కొత్త పెన్షన్ల కోసం పేదల తిప్పలు..!
తాడ్వాయి మండలంతో పాటు ఆయా మండల గ్రామాల ప్రజలకు కొత్త పింఛన్ల మంజూరు వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది.

దిశ, తాడ్వాయి : జిల్లాలోని తాడ్వాయి మండలంతో పాటు ఆయా మండల గ్రామాల ప్రజలకు కొత్త పింఛన్ల మంజూరు వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. నూతన పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు, తమ అప్లికేషన్ల స్థితిని తెలుసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, కాగితాల ఫైళ్లతో ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పెన్షన్ల పై కీలక ప్రకటన చేస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరిగిన విపరీతమైన ప్రచారమే ఈ హడావుడికి కారణమైంది.
ఆశగా ఎదురుచూసి.. ఆఫీసుల బాట పట్టి
జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వస్తుందని, కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని నిజమని నమ్మిన మండల పరిధిలోని వందలాది మంది నూతన లబ్ధిదారులు గత వారం రోజులుగా కాగితాలు పట్టుకుని మీసేవ కేంద్రాలకు, మండల పరిషత్ కార్యాలయానికి, గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీసులకు క్యూ కట్టారు. ఉదయం 8 గంటల నుంచే మీసేవ కేంద్రాల వద్ద లబ్ధిదారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు.
సర్వర్ల సతాయింపు.. అధికారుల తలపోటు..
ఒకేసారి వందలాది మంది లబ్ధిదారులు తరలిరావడంతో మీసేవ కేంద్రాల్లో సర్వర్లు సైతం డౌన్ అయిపోయాయి. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ లబ్ధిదారుల నిలదీతలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైస్థాయి నుంచి కొత్త పెన్షన్ల మంజూరు పై గానీ, కొత్త దరఖాస్తుల స్వీకరణ పై గానీ స్థానిక అధికారులకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ఆఫీసులకు రావద్దని చెప్తున్నా జనం వినకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల పేదలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ప్రభుత్వం నూతన పెన్షన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం పై ఒక అధికారిక స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో కార్యాలయాల చుట్టూ పేదల తిప్పలు తప్పవని ఆయా మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.. సవిత రెడ్డి, ఎంపీడీఓ, (తాడ్వాయి)
సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం చూసి లబ్ధిదారులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు గానీ, మార్గదర్శకాలు గానీ రాలేదు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. దరఖాస్తులు తీసుకొచ్చిన వారిని కాదనలేక, ప్రస్తుతానికి పంచాయతీ కార్యదర్శులకు వాటిని తీసుకోమని తెలిపాం.లబ్ధిదారులు పుకార్లను నమ్మవద్దు.






