కరోనాను ఎదుర్కొనేందుకు అదొక్కటే మార్గం.. ఉప రాష్ట్రప్రతి సూచన

by  |
Vice President Venkaiah Naidu
X

దిశ రాజేంద్రనగర్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన మార్గమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అంతేగాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు జిల్లా కేంద్రాల్లో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకకాలంలో వైద్య శిబిరాలు నేడు ప్రారంభించారు. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి దాదాపు 5 వేల మందికి టీకా వేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. కరోనాపై సాగుతున్న పోరాటంలో కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఆదరణ కార్యక్రమాన్ని చేపడుతోందని, దీనిని ప్రజా ఉద్యమంగా మార్చి విజయవంతం చేయాలని కోరారు. రోజుకు కోటి డోసులు ఇస్తున్న దేశం మన భారతదేశం అని, ఇప్పటివరకు దేశంలో 69 కోట్ల మందికి కరోనా డోసులు ఇచ్చారని తెలిపారు. వ్యాక్సిన్‌ను ఒక మతానికి ముడిపెట్టడం సరికాదన్నారు.

Vice President Venkaiah Naidu

అందరూ ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం వంటివి చేస్తే ఎలాంటి రోగాలు రావని అన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ వాడాలని సూచించారు. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. గతంలో భారతదేశంలో టీకాను దిగుమతి చేసుకోవడం ద్వారా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేదని, కానీ, నేడు దేశంలో టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా భారీగా ఖర్చు తగ్గిందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కూడా కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస రావు, డాక్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, త్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, మల్లారెడ్డి, భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story