- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏజెన్సీకి సీజనల్ ముప్పు !
ములుగు జిల్లాలో రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లాలో రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ములుగు జిల్లా దట్టమైన అటవీ ప్రాంతంతో కూడి ఉండటమే కాకుండా గిరిజన గ్రామాలు, గుత్తికోయల గుడారాలు ఉండగా ప్రతీ వర్షాకాలం ప్రారంభంలోనే పలు రకాల వ్యాధుల బారిన పడి ప్రజలు ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. జిల్లాలో గతంలో కంటే వైద్య సదుపాయాలు మెరుగైనప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. వైద్యాధికారుల ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ప్రజల నిర్లక్ష్యంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో నీరు రోడ్లపైకి చేరడం, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో ఆయా ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. సీజనల్ వ్యాధులు సోకుతున్న సమయంలో దోమలను అరికట్టేందుకు ప్రత్యేక తీసుకుంటున్నామని, దోమతెరలను పంపిణీ చేస్తున్నామని సంబంధిత అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఆచరణలో సాధ్యం కాకపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు నేటి వరకు ఆ కార్యక్రమాలను ప్రారంభించలేదు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు సైతం సీజనల్ వ్యాధులపై అవగాహన లేకపోవడంతో అధికారులు గ్రామ సర్పంచులకు ఆదేశాలు జారీ చేయకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా జ్వర పీడితులు..
జిల్లాలో 80 శాతం దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ప్రతీ గ్రామంలో వర్షపు నీరు నిలిచిపోతుండడంతో ఆ ప్రాంతాలు దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. దోమకాటుతో వ్యాధుల బారిన పడినవారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులు వర్షాకాలంలో వాగులు వంకల్లో నీరుతాగడంతో వాంతులు, విరేచనాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న జ్వరపీడితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గతేడాది వర్షాకాలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోగా ఆయా గ్రామాల ప్రజలకు సరైన వైద్యం అందకపోవడంతో 268 మంది మృత్యువాత పడ్డారు. వర్షాకాలం వంచిందంటే చాలు ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్పత్రులన్నీ వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతుంటాయి.
జిల్లాలో రెండు కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటు..
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో మంత్రి సీతక్క చొరవతో జిల్లా యంత్రాంగం రెండు కంటైనర్ ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. నాలుగు పడకలతో ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండనున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు. జిల్లాలోని తాడ్వాయి మండలం కొడిశెల గ్రామ పంచాయతీ పరిధిలోని పోచపూర్ , కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామంలో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
దోమలతో ఐదు రకాల వ్యాధులు..
దోమలతో ఐదు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ఆ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్య చికిత్స పొందని పక్షంలో మృత్యువాత పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు దోమకాటు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి వ్యాధి సోకినా తక్షణమే వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమకాటుతో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా వ్యాధి, మెదడువాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది.






