తాను చనిపోయి ప్రాణదానం చేసిన కానిస్టేబుల్..

by  |
తాను చనిపోయి ప్రాణదానం చేసిన కానిస్టేబుల్..
X

దిశ, పాలేరు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన నలగాటి​ వీరబాబు(34) అనే వ్యక్తి కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ​ ఈనెల 12న విధులకు వెళ్తుండగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వీరబాబు మంగళవారం బ్రెయిన్​డెడ్​ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీనితో మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్​ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్​ చానల్​ ద్వారా మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి పంజాగుట్ట నిమ్స్​ ఆస్పత్రికి గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రమాదంలో గాయపడి బ్రెయిన్​డెడ్​ అయిన వీరబాబు హృదయాన్ని నిమ్స్​లో ఓ రోగికి మార్పిడి చేయనున్నారు. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు యశోదా ఆస్పత్రి నుంచి వీరబాబు గుండెను అంబులెన్స్​లో ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. కానీ మొట్టమొదటిసారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్​కు గుండెను తరలిస్తున్నారు. ఒక్కరోజులోనే హృదయం లభించింది. కానిస్టేబుల్​ వీరబాబు బాడీ నుంచి సేకరించిన గుండెను 30 ఏళ్లలోపు పెయింటర్​కు అమర్చనున్నారు. నిమ్స్​లో చికిత్స పొందుతున్న పెయింటర్​ గుండె కోసం మంగళవారం జీవన్​దాన్​లో నమోదు చేసుకున్నారు. కానిస్టేబుల్ వీరబాబు గుండెను పొందినది కూసుమంచి మండలం, మునిగేపల్లి గ్రామవాసి తుపాకుల హుస్సేన్‌గా సమాచారం.

కేవలం 24 గంటల్లోనే ఆయనకు హృదయం లభించడం విశేషం. గ్రీన్ చానెల్‌కు అందరు సహకరించడంతో ప్రస్తుతం పెయింటర్‌కు వీరబాబు గుండెను అమర్చనున్నట్టు తెలుస్తోంది. తమ కుటుంబసభ్యుడి అవయవాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన వీరబాబు ఫ్యామిలీని కూసుమంచి మండల ప్రజలు అభినందించడమే కాకుండా ధైర్యం చెబుతున్నారు.



Next Story