ఆర్టీఏ కార్యాలయాలా.. గ్యారేజీలా?

by  |
ఆర్టీఏ కార్యాలయాలా.. గ్యారేజీలా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రాంతీయ రవాణా అధికారుల(ఆర్టీఏ) కార్యాలయాలన్నీ సరైనపత్రాలు లేక ఇతర కేసుల్లో పట్టుబడ్డ వాహనాలతో నిండిపోయి గ్యారేజ్‌లను తలపిస్తున్నాయి. పట్టుబడ్డ వాహనాలను వాటి యజమానులు తీసుకెళ్లకపోవడంతో దశాబ్దకాలంగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే ఉండిపోయి, పార్కింగ్ ప్రదేశాలను మింగేస్తున్నాయి. ఇందులో కొన్ని వాహనాలకు సంబంధించిన కేసులు పరిష్కృతమైనా వాహనాలను తీసుకెళ్లకపోవడంతో చాలావరకు తుప్పుపట్టిపోతున్నాయి.

నగరంలోని తిరుమలగిరి, నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లో అధికసంఖ్యలో ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు ఒకదానిపై ఒకటి దుమ్ముపట్టిన లేదా ఖాళీస్థలంలో పార్క్‌ చేసి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. వాహన యజమానులు సంబంధితపత్రాలు దాఖలు చేయడంలో విఫలమైతే, ఆర్టీఏ అధికారులు సదరు వాహనాలను వేలం వేయవచ్చు. కానీ, చాలా సందర్భాల్లో అధికారులు వారికి నోటీసులు కూడా పంపలేకపోవడం సమస్యకు కారణమవుతోంది. అయితే సంవత్సరాలకొద్దీ వాహనాలను తమ స్వాధీనంలో ఉంచుకునే అధికారం ఆర్టీఏకు లేదు. వేలం వేయడం లేదా వాహనాల విడుదలకు సంబంధించి యజమానికి నోటీసులు పంపడం ద్వారా వాటిని విక్రయించవచ్చు. ఒకవేళ వాహన యజమాని సంబంధిత జరిమానా చెల్లించకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకునే వీలుంది. ఈ చట్టం ప్రకారం పలానా తేదీ, ప్రదేశంలో వేలం నిర్వహించనున్నామని పత్రికాప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరవాత బహిరంగ వేలం నిర్వహణకు ఒక టెండరు అధికారి నియమించబడతారు. ఇదంతా ఓ ప్రక్రియ కాగా, ఆర్టీఏ నోటీసులు పంపకపోవడంతో ఈ విధంగా కార్యాలయాల్లో వాహనాలు పోగై, తుప్పుపట్టిపోతున్నట్టు సమాచారం. ఈ విషయాలపై జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేష్‌ను వివరణ కోరగా ‘వాహన యజమానులకు నోటీసులు పంపించాం, ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ వాహనాలు క్లెయిమ్ చేసుకునేందుకు ఎవరూ రాకపోతే వేలంలో విక్రయిస్తామం’ అని తెలిపారు.


Next Story

Most Viewed