25 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా

by  |
25 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ క్రమంగా పెంచుతూ మంగళవారం నుంచి 1,034 కేంద్రాల్లో టీకాలు ఇవ్వాలనుకుంటోంది. ప్రతీ కేంద్రంలో రోజుకు వంది మంది చొప్పున టీకాలను ఇచ్చే ఏర్పాట్లు జరిగాయని, ఈ వారంలోనే ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది మొత్తానికి అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది. రోజుకు సగటున లక్ష మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని అంచనా వేశామంటోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే సోమవారం (జనవరి 25) నుంచి వంద పడకలకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. తొలి రోజు కేవలం 140 కేంద్రాల్లో 30 మంది చొప్పున 3,962 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ సోమవారం 13,666 మందికి ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 17,628 మందికి ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 1,119 ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 1.25 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత ప్రైవేటు రంగంలోని 6,106 ఆసుపత్రుల్లోని సుమారు రెండు లక్షల మంది సిబ్బందికి ఇవ్వనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ వారంలోనే సుమారు మూడున్నర లక్షల డోసులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లాలకు చేరుకుంటున్న వ్యాక్సిన్

అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ వ్యాక్సిన్ పంపిణీ అయ్యేందుకు మొత్తం 1,034 వ్యాక్సిన్ పాయింట్లను ఏర్పాటు చేసిన వైద్యారోగ్య శాఖ సోమవారమే సుమారు లక్ష డోసుల్ని సరఫరా చేసింది. మరికొన్ని డోసులను తీసుకెళ్లడానికి వివిధ జిల్లాల నుంచి కోల్డ్ స్టోరేజీ వాహనాలు సోమవారం రాత్రికే చేరుకున్నాయి. హెల్త్ కేర్ సిబ్బందిలోని పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన తర్వాత డాక్టర్లు, నర్సులకు, పారా మెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకాలు ఇవ్వగా సోమవారం 50 మంది చొప్పున పంపిణీ అయింది. ఇకపై రోజుకు ఒక్కో కేంద్రంలో 100 మందికి అందనుంది.హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిన తర్వాత పోలీసులు, రెవెన్యూ, స్థానిక పరిపాలనా సంస్థల్లోని పారిశుధ్య కార్మికులైన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పంపిణీ కానుంది. పోలీసు శాఖలో సుమారు 80 వేల మంది, మరో 40 వేల మంది పారిశుధ్య కార్మికులు, సుమారు ఇరవై వేల మంది రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ అందాల్సి ఉంది. ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులు లబ్ధిదారుల పేర్లను ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తూ ఉన్నారు. ‘కొవిన్’లో సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట రిజిస్టర్లలో నమోదు చేసుకుని మాన్యువల్‌గా పంపిణీ ప్రక్రియను ఆయా కేంద్రాల స్పెషల్ ఆఫీసర్లు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed