చిరు జీవుల కోసం ఎకోబ్రిడ్జి

by  |
చిరు జీవుల కోసం ఎకోబ్రిడ్జి
X

దిశ, వెబ్‌డెస్క్: భూమ్మీద బతకడానికి మనకెంత హక్కు ఉందో.. జంతువులకు, పశుపక్ష్యాదులకు అంతే హక్కు ఉంది. మన అవసరాల కోసం వాటిని చంపడమే కాకుండా, వాటికి ఆవాసాలు లేకుండా అడవులను సైతం నరికేస్తున్నాం. ఈ నేపథ్యంలో రక్షణ కరువై, ఆహారం కూడా దొరక్క అనేక జీవులు మృత్యువాతపడుతున్నాయి. ఈ కారణాలతో అవి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అంతేకాదు అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలు.. హఠాత్తుగా రోడ్డు మీదకొచ్చే చిన్న జీవాలను ఢీకొట్టడంతో, అవి మరణిస్తున్నాయి. అయితే పలు రక్షణ చర్యలు చేపడితే, ఆ మూగ జీవాలు ప్రాణాలను కాపాడే అవకాశం ఉండటంతో, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌ అటవీశాఖ అధికారులు ‘కలాదుంగి- నైనిటాల్‌’ జాతీయ రహదారిలో మొట్టమొదటి ఎకో బ్రిడ్జిని రూపొందించారు. ఈ ఎకో బ్రిడ్జిని రోడ్డు నుంచి 90 మీటర్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు.

‘అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల వల్ల తరచుగా మూగ జీవాలు, చిరు ప్రాణులు బలవుతున్నాయి. ఇది పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఎకో బ్రిడ్జిని నిర్మించేందుకు ముందుకు వచ్చాం. వెదురు, గడ్డి మాత్రమే ఉపయోగించి పూర్తి పర్యావరణహితంగా ఈ బ్రిడ్జిని నిర్మించాం. రూ. 2 లక్షలతో కేవలం పది రోజుల్లోనే ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాం. సరీసృపాలు, పైథాన్స్, లియోపార్డ్స్, ఉడతలు, కోతులు ఆయా జంతువులన్నీ ఈ బ్రిడ్జి సాయంతో రోడ్డు దాటొచ్చు. నైనిటాల్ టూరిస్ట్ ప్లేస్ కావడంతో చాలా మంది పర్యాటకులకు అక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలోనే వాహనాలు ఢీకొని చిన్నజీవులు చనిపోతున్నాయి. ఈ బ్రిడ్జిని మానిటర్ చేయడానికి నాలుగు కెమెరాలను బిగించాం’ అని రాంనగర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.



Next Story