పంది కిడ్నీని మనిషికి అమర్చిన డాక్టర్లు..

by  |
పంది కిడ్నీని మనిషికి అమర్చిన డాక్టర్లు..
X

దిశ, ఫీచర్స్: వైద్య చరిత్రలో మొదటిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. గ్రహీత రోగనిరోధక వ్యవస్థ ఈ చర్యను వెంటనే తిరస్కరించకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్‌పుల్‌గా అవయవ మార్పిడి చేయగలిగారు. ఈ విజయం అవయవాల కొరతను తగ్గించేందుకు సాయపడే కీలక ముందడుగు కాగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యూయార్క్ నగరంలోని NYU లాంగోన్ హెల్త్‌ సెంటర్‌లో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇందులో భాగంగా పంది జన్యువులు మార్చబడ్డాయి. దీనివల్ల అవయవ మార్పిడి జరిగినప్పుడు, దాని కణజాలాన్ని తిరస్కరించేందుకు కారణమయ్యే అణువులు అందులో ఉండవు. ఇక అవయవ గ్రహీత బ్రెయిన్ డెడ్ పేషెంట్ కాగా.. అతని మూత్రపిండాలు పనిచేయడం లేదు. దీంతో ఆమె కుటుంబం ఈ ప్రయోగానికి అంగీకరించిందని పరిశోధకులు వెల్లడించారు.

మూడు రోజుల పాటు.. కొత్త మూత్రపిండాలను పేషెంట్ రక్తనాళాలకు జతచేసిన పరిశోధకులు ఆమె శరీరం వెలుపలి నుంచే వాటి పనితీరును మానిటర్ చేశారు. కాగా మార్పిడి చేసిన మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షా ఫలితాలు చాలా సాధారణంగా కనిపించినట్లు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమేరీ అన్నారు. మార్పిడి తర్వాత ఆశించిన మొత్తంలో మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేశాయని తెలిపారు. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత గ్రహీత అసాధారణ క్రియేటినిన్ స్థాయి, పేలవమైన మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరినట్లు మోంట్‌గోమేరీ చెప్పారు.

యూఎస్‌లో కిడ్నీ కోసం ఎదురుచూస్తున్నవారు 90 వేలు..

యునైటెడ్ నెట్‌వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 107,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి ఉండగా.. ఇందులో 90,000కి పైగా కిడ్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన మూత్రపిండాల కోసం సగటున మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఇక జంతువుల అవయవాలను మనుషులకు మార్పిడి చేసూ అవకాశంపై పరిశోధకులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. కానీ మానవ నిరోధక వ్యవస్థ ఈ చర్యను తక్షణం తిరస్కరిస్తే ఎలా నిరోధించాలనే దానిపై ఇన్నాళ్లూ తడబడ్డారు. పంది జన్యువును తిరస్కరించే చర్యను ప్రేరేపించే సమస్యను కార్బోహైడ్రేట్- చక్కెర అణువు లేదా ఆల్ఫా-గాల్ అని పిలువబడే గ్లైకాన్ నివారిస్తుందని మోంట్‌గోమేరీ బృందం సిద్ధాంతీకరించింది.

భవిష్యత్‌లోని మరిన్ని ప్రయోగాలు..

ఇక జన్యుపరంగా మార్పు చెందిన పందిని ‘గాల్‌సేఫ్’ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్ప్ రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. కాగా పందుల నుంచి అభివృద్ధి చేయబడిన వైద్య ఉత్పత్తులను మానవుల్లో ఉపయోగించే ముందు నిర్దిష్ట FDA ఆమోదం అవసరం అని ఏజెన్సీ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగం సింగిల్ ట్రాన్స్‌ప్లాంట్‌కే పరిమితం అవడంతో పాటు మూత్రపిండాలను మూడు రోజులు మాత్రమే పరీక్షించారు. కాబట్టి భవిష్యత్ ట్రయల్స్‌లో కొత్త అడ్డంకులు ఎదురైతే వాటిని అధిగమించాల్సి ఉంటుందని మోంట్‌గోమేరీ చెప్పారు.

37 గంటలు నిద్రపోతే చాలు.. రూ.25 లక్షల జీతం

టెక్నాలజీ పుణ్యమాని.. తల్లైన 70 ఏళ్ల వృద్ధురాలు


Next Story

Most Viewed