పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. నెత్తిన గంగాజలం

by  |
పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. నెత్తిన గంగాజలం
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా పనిమీద పోలీస్ స్టేషన్‌ గడప తొక్కాలంటే ఎవరైనా సరే ఒకింత విముఖత ప్రదర్శిస్తుంటారు. ఏవైనా గొడవలుంటే స్టేషన్ దాకా వెళ్లకుండా అపోనెంట్స్‌తో కాంప్రమైజ్ అయ్యేందుకే మొగ్గు చూపుతుంటారు. ఒకవేళ ఏదైనా కేసు విషయంలో తప్పక వెళ్లాల్సి వస్తే.. ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న భయం కూడా వెంటాడుతుంటుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పొచ్చినా.. ఆ ఫీలింగ్ అయితే పోదు. అయితే ఇప్పుడు యూపీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ‘సేఫ్టీ ప్రోటోకాల్స్’ పేరుతో ప్రవేశపెట్టిన పద్ధతులు చూస్తే మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఆ కొత్త పద్ధతులేంటో మీరూ తెలుసుకోండి..

ఉత్తర ప్రదేశ్‌లోని నౌచాంది పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ప్రేమ్ చంద్.. స్టేషన్‌కు వచ్చే విజిటర్స్‌పై గంగాజలం చల్లించడంతో పాటు నుదుటన చందనం రాసుకోవడాన్ని తప్పనిసరి చేశాడు. ఈ రెండు చర్యలు కూడా వివిధ కేసుల నిమిత్తం అక్కడికి వచ్చేవారిని శాంతపరచడంతో పాటు శాంతిభద్రతల మెరుగుదలలో ప్రభావం చూపిస్తాయని ఎస్‌హెచ్‌వో ప్రేమ్ చంద్ చెబుతుండటం విశేషం. అంతేకాదు గంగాజలాన్ని ఉపయోగిస్తున్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారు శాంతంగా ఉంటున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎస్‌హెచ్‌వో టేబుల్‌పై గంగాజలం బాటిల్స్‌ను కూడా చూడొచ్చు.

‘వివిధ కేసు వ్యవహారాలతో ఇక్కడికి వచ్చే వారిపై గంగాజలం చల్లితే, వారు చాలా ప్రశాంతంగా తమ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. నెమ్మదిగా వారి సమస్యలు తగ్గిపోతాయి. పవిత్ర జలంతో పాటు ‘పరిశుభ్రతా మంత్రాన్ని’ జపిస్తూ విజిటర్లను పవిత్రులుగా చేస్తున్నా’ అని ఎస్‌హెచ్‌వో ప్రేమ్ చంద్ చెప్పుకొచ్చారు. అంతేకాదు హోలీ సందర్భంగా ఆయన గంగాజలం బాటిల్స్‌ను బహుమతులుగా అందజేయడం విశేషం.



Next Story