TG: సాకారం కాబోతున్న బుల్లెట్ ట్రైన్ కల.. నేటి బడ్జెట్‌పైనే అందరి ఆశలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 02:09:26  IST  )

రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది.

TG: సాకారం కాబోతున్న బుల్లెట్ ట్రైన్ కల.. నేటి బడ్జెట్‌పైనే అందరి ఆశలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ రూట్ మ్యాప్ నకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేశాయి. నాలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. అయితే నేడు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

రూట్ మ్యాప్ ఇలా..

ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం.. ఈ బుల్లెట్ ట్రైన్ తమిళనాడు రాజధాని చెన్నయ్ నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి వచ్చేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అక్కడి నుంచి నల్లగొండ, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల మీదుగా కర్ణాటక రాజధాని బెంగుళూరుకు వెళ్లేలా డిజైన్ చేశారు.

నిధుల కేటాయించగానే..

మొత్తంలో రూట్‌లో భూ సేకరణను ఆయా రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. అయితే భూసేకరణకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే భూసేకరణ వేగంగా పూర్తవుతుందని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో బుల్లెట్ ట్రైన్ కల సాకారమవుతున్నదనే చర్చ జరుగుతున్నది.

మెరుగుపడనున్న రవాణా సౌకర్యం

పెరుగుతున్న ప్రజల అవసరాలు, రవాణా సదుపాయాలు తదితర వాటితో బుల్లెట్ ట్రైన్ అవసరం ఉందని గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లక్షల మంది బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఇతర కంపెనీల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే వీరికి రవాణా సదుపాయం మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి స్పీడప్

అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా బెంగళూరు వెళ్లే విధంగా బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఖరారు చేశారు. దీంతో ఫ్యూచర్ సిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున అవసరమయ్యే భూ సేకరణ ప్రక్రియ కూడా సులువవుతుందని, నగరానికి ఆనుకొని మరొక ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. హైదరాబాద్ నుంచి అక్కడికి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. అమరావతి నుంచి వివిధ నగరాలకు సులువైన రవాణా సదుపాయాలు ఉంటే మరింత త్వరగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అమరావతి మీదుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి ఇటు హైదరాబాద్, అటు చెన్నయ్ కి రవాణా సదుపాయం సులువు కానుంది. దేశంలోనే ప్రముఖ నగరాలుగా గుర్తింపు పొందిన చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరులను కలుపుతూ చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు.. రవాణా రంగంలో సరికొత్త మైలు రాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Read More..

Union Budget: కేంద్ర బడ్జెట్ టైమింగ్, తేదీలను ఎందుకు మార్చారు?

Next Story