Union Budget: కేంద్ర బడ్జెట్ టైమింగ్, తేదీలను మార్చడానికి కారణం ఇదే

by Mahesh Kanagandla |   (  Updated:2026-02-11 11:51:43  IST  )

Union Budget: కేంద్ర బడ్జెట్ టైమింగ్, తేదీలను మార్చడానికి కారణం ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ సమయాలు, తేదీలు మారుతూ వచ్చాయి. ఆంగ్లేయుల పాలనలో బ్రిటన్‌లో సమయానికి అనుగుణంగా ఇక్కడ పద్దును ప్రకటించేవారు. ఆ తర్వాత సమయాన్ని మనదేశానికి అనుగుణంగా మార్చారు. ఆ తర్వాత తేదీలనూ మార్చారు. 1999 వరకు మన దేశంలో కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బ్రిటీష్ వర్కింగ్ అవర్స్‌కు అనుగుణంగా ఆ ప్రక్రియ సాగేది. స్వాతంత్ర్యానికి పూర్వం మొదలైన ఈ సాంప్రదాయం.. ఆ తర్వాత కూడా 1999 వరకు సాగింది. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ సమయాన్ని మార్చారు. సాయంత్రం 5 గంటలకు బదులు మన దేశ కాలమానానికి అనుగుణంగా ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటి నుంచి బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకే ప్రవేశపెడుతున్నారు. అలాగే.. బడ్జెట్ ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టేవారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. అప్పటి నుంచి బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెడుతున్నారు.

అందుకే ఆదివారమైనా..

అందుకే ఈ సారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారమైనా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలుస్తున్నారు. 1999లో ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారమే వచ్చింది. అందుకోసం బడ్జెట్‌ను ఒకరోజు ముందు శనివారమే ప్రవేశపెట్టారు. తాజాగా, ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో స్టాక్ మార్కెట్లు కూడా సండే నడవనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ కాపీని పెద్దల సభ ముందూ ఉంచుతారు.

Next Story