ఆర్థిక వృద్ధికి 'ఆరు' సూత్రాలు.. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలమ్మ కీలక ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 06:05:27  IST  )

ఆర్థిక వృద్ధికి ఆరు సూత్రాలు.. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలమ్మ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ కు యువశక్తి బడ్జెట్ గా నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 'ఆరు' సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ, సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో ఆరు కీలక రంగాలపై దృష్టి సారించారు. పార్లమెంట్ లో ఆమె బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. రాబోయే కాలంలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ ఆరు అంశాలు చోదక శక్తులుగా పనిచేస్తాయని ఆమె వెల్లడించారు. ఈ మేరకు వ్యూహాత్మకంగా ఏడు రంగాలలో తయారీ సామర్థ్యాన్ని భారీగా పెంచడం (Scaling up manufacturing), పాత పారిశ్రామిక రంగాలకు పునరుజ్జీవం పోయడం (Rejuvenating legacy sectors) వంటి కీలక ప్రతిపాదనలను ఆమె సభ ముందు ఉంచారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి 'ఛాంపియన్ MSME'లుగా తీర్చిదిద్దడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతం ఇవ్వడం (Infra push), దేశ ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని దీర్ఘకాలికంగా నిర్ధారించడం, అలాగే నగరాలను ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు 'సిటీ ఎకనామిక్ రీజియన్స్'ను అభివృద్ధి చేయడం వంటి ఆరు సూత్రాలతో ఆర్థిక ప్రణాళికను రూపొందించినట్లు ఆమె వివరించారు. ఈ ప్రణాళికాబద్ధమైన చర్యల ద్వారా ఉపాధి కల్పనతో పాటు దేశీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సెమి కండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

Next Story