Disha Special: భారతదేశాన్ని మలుపుతిప్పిన అత్యంత ముఖ్యమైన బడ్జెట్లు

by Bhoopathi Nagaiah |

బడ్జెట్ (Budget) అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు.. అంతకుమించి. ప్రజల ఆశలను నెరవేర్చడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడం కూడా బడ్జెట్ ప్రధాన లక్ష్యం.

Disha Special: భారతదేశాన్ని మలుపుతిప్పిన అత్యంత ముఖ్యమైన బడ్జెట్లు
X

బడ్జెట్ (Budget) అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు.. అంతకుమించి. ప్రజల ఆశలను నెరవేర్చడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడం కూడా బడ్జెట్ ప్రధాన లక్ష్యం. దేశంలో 1950లో మొదట బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నాటినుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా లోక్ సభ(Lok Sabha)లో ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. కానీ, కొన్ని బడ్జెట్లు మాత్రం మొత్తం దేశ దశ దిశను మార్చివేశాయి.

ఒకప్పుడు దేశంలో ఆదాయ పన్ను (Income tax) దాదాపు 97.5శాతం కూడా ఉండేది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ, ఇది నిజం. ఎవరైనా ఏడాదిలో రూపాయి సంపాదిస్తే అందులో అతడికి దక్కేది కేవలం 2.5పైసలు మాత్రమే.. మిగతా 97.5పైసలు ప్రభుత్వానికి కట్టాల్సివచ్చేది. 1970లో అప్పటి ప్రభుత్వం సంవత్సరానికి రూ.5వేలనుంచి రూ.10వేల వరకు ఆదాయం ఉన్నవారికి 10శాతం పన్ను విధించింది.. రూ.2లక్షల వరకు ఆదాయం ఉంటే 97.5శాతం పన్ను విధించింది. కానీ, ప్రజలు పన్ను కట్టేందుకు ముందుకురాకపోవడంతో తర్వాతి ప్రభుత్వాలు పన్ను రేటు(Tax rate)ను తగ్గిస్తూ వచ్చాయి.

ఇక దిగుమతు(Imports)లకు సంబంధించి దేశంలో పెద్ద ప్రహసనమే ఉండేది. దేశంలోకి ఒక కంప్యూటర్ (Computer)తెచ్చుకోవాలంటే అసలు ధర కన్నా నాలుగింతలు ఎక్కువ డబ్బు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వచ్చేది. అంతేకాదు ఆ ఫైలుకు కనీసం నాలుగు మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోని దాదాపు 21మంది అధికారుల సంతకాలు అవసరమయ్యేది. దీంతో ఎన్నో కంపెనీలు(Companies) దేశంలో కంపెనీలు పెట్టినా.. ఇంజినీర్లను నియమించుకుని విదేశాల్లోని తమ కార్యాలయాల్లో శిక్షణ, ఉద్యోగం ఇచ్చే దుస్థితి కలిగింది.

మన్మోహన్ (Manmohan Singh) తీసుకున్న నిర్ణయాలతో విదేశీ, స్వదేశీ కంపెనీలు (Foreign and domestic companies)దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. కానీ, ఇప్పుడు సరళీకరణతో అంతా మారిపోయింది. అంతా వాట్సాప్(WhatsApp) యుగం.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా చాలా ధ్రువీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారానే మంజూరు చేస్తున్నది. ఇలా ఎన్నో మార్పులకు బడ్జెట్లే కారణమయ్యాయి. అలాంటి కీలక మార్పులు తెచ్చిన.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటినుంచి దేశ గతిని మార్చివేసిన బడ్జెట్లపై దిశ ప్రత్యేక కథనం. - హరీశ్ శ్రీపెరంబుదూర్

తొలి బడ్జెట్ 1947

స్వతంత్ర్య భారత దేశంలో 1947 నంబర్ 26న తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మంత్రిగా ఆర్ షణ్ముగం శెట్టి (Finance Minister R Shanmugam Shetty)చరిత్రలో నిలిచిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కాబట్టి ఇది చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. బడ్జెట్ వ్యయం (Budgetary expenditure) రూ.197.29కోట్లు.

ప్రణాళిక సంఘం(Planning Commission) (1950)

దేశానికి రెండో ఆర్థికమంత్రి అయిన జాన్ మథై (John Matthew) ప్రణాళిక సంఘాన్ని ఈ బడ్జెట్‌లోనే ప్రకటించారు. బడ్జెట్ వ్యయం రూ.197కోట్లు. రక్షణ, మౌలిక వసతులు, పారిశ్రామీకరణకు ఇందులో అధిక భాగం కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి మాట్లాడుతూ మనకున్న వనరులను దేశ రక్షణ.. ఆర్థిక ప్రగతికి సమ ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆ సమయంలో డిఫెన్స్ రంగానికి బడ్జెట్ లో రూ.92 కోట్లు దాదాపుగా సగం కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు నిధులు కేటాయించారు.

పంచవర్ష ప్రణాళిక (1952)

రష్యా(Russia)లో అమలవుతున్న సామ్యవాద విధానాలకు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawahar Lal Nehru) ఆకర్షితులయ్యారు. ఇందులో భాగంగానే దేశంలో పంచవర్ష ప్రణాళిక వ్యవస్థ మొదలైంది. 1952లో నాటి ఆర్థిక మంత్రి సీడీ దేశ్‌ముఖ్ (CD Deshmukh) బడ్జెట్ లో పంచవర్ష ప్రణాళిక మౌలిక స్వరూపం.. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి వ్యవస్థపై బడ్జెట్ కేటాయింపులు జరపాలన్న అంశంపై చర్చించారు. వ్యవసాయంలో స్వయంప్రతిపత్తికి సాగునీరు, విద్యుత్ రంగంపై భారీగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.350కోట్లు ప్రకటించారు. ఈ సమయంలోనే భాక్రా నంగల్ ప్రాజెక్టు(Bhakra Nangal Project) నిర్మాణానికి సంకల్పించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పథకాలు ప్రకటించారు. ఉద్యోగాల కల్పన కొత్త కొత్త ప్రభుత్వరంగ సంస్థలు నెలకొల్పారు.

ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు (1961)

భారతదేశంలో తొలిసారి ప్రత్యక్ష పన్నులపై సంస్కరణలను 1961లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. పన్నుల చెల్లింపులో సంక్లిష్టతలను తొలగిస్తూ.. పారదర్శక పన్నుల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఈ బడ్జెట్ సంస్కరణకు నాటి ఆర్థిక మంత్రి మోరార్జీ దేశాయ్ (Morarji Desai)కారణం. అప్పటివరకు ఉన్న పన్ను నిబంధనల కారణంగా పన్ను ఎగవేతలు చాలా ఎక్కువగా ఉండేవి. పన్ను చెల్లింపులు అతి తక్కువగా నమోదయ్యేవి. కానీ, దేశంలో ప్రజాపయోగ పథకాలకు అవసరమైన నిధులు అందకపోవడంతో ప్రభుత్వం పారదర్శక పన్నుల వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రభుత్వాలు వృథా ఖర్చులు తగ్గించుకునేలా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ద్రవ్యలోటు తగ్గుతుందని బహిరంగంగానే ప్రకటించారు. అదేసమయంలో పన్ను చెల్లింపులకు స్వీయ అంగీకారం ఉంటే సరిపోతుందని పేర్కొంటూ.. అప్పటివరకు ఉన్న అధికారుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించారు. పన్నుల పరిధిలోకి ఓ స్థాయి ఆదాయం ఉన్న వ్యక్తులతోపాటు, వ్యాపార సంస్థలు వచ్చేలా చేశారు. పన్ను ఎగవేతలపై భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు చేశారు.

తొలి ఆర్థిక సంస్కరణలు (1966)

దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి.. ఆహార కొరతతో ప్రజలు అల్లాడుతున్న క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఆర్థిక సంస్కరణలను 1966 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి సచింద్ర చౌదరి (Sachindra Chaudhary) ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు బడ్జెట్‌లో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్ లో రూపాయి మారకాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఫలితంగా దిగుమతులు భారీగా పెరిగి.. దేశంలో ఆహార కొరతనుంచి ఉపశమనం లభించింది. విదేశీ పెట్టుబడుల(Foreign investment)కు మార్గాలు తెరిచారు. సబ్సిడీ(subsidy)లకు కోత విధించారు. రేపు దేశం దృఢంగా నిలబడాలి అంటే ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆర్థికమంత్రి ప్రకటించారు. నిజానికి పీవీ నరసింహారావు(PV Narasimha Rao) సంస్కరణకు ఆద్యుడిగా కీర్తిని పొందినా సచింద్ర హయాంలోనే విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా నిర్ణయాలు జరిగాయి.

బ్లాక్ బడ్జెట్ (Black budget)(1973)

అసలు ఏమాత్రం పారదర్శకత లేకుండా నిధుల కేటాయింపులు ఎలా జరిగాయి? ఎక్కడకు వెళ్లాయి? అన్న వివరాలు ఏమీ లేకుండా ‘రహస్య ప్రాజెక్టులకు కేటాయింపులు’ అంటూ ప్రకటించిన ఏకైక బడ్జెట్ 1973లో వైబీ చవాన్(YB Chavan) ప్రవేశపెట్టిన బడ్జెటే కావొచ్చు. అందుకే నాడు ప్రతిపక్షాలు దీనిని ‘బ్లాక్ బడ్జెట్’ అని ప్రకటించాయి. ఈ బడ్జెట్ లోనే జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీతోపాటు దేశంలోని అన్ని బొగ్గు గనులను ప్రభుత్వం జాతీయీకరణ చేసింది.

నల్లధనంపై యుద్ధం(Black money) (1986)

వీపీ సింగ్(VP Singh) ప్రభుత్వం నల్లధనం(Black money)పై యుద్ధం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నల్లధనం వెలికి తీసేందుకు ప్రభుత్వం ఓ ప్రయోగం చేసింది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (వీడీఐఎస్) ప్రవేశపెట్టింది. పన్ను కట్టని డబ్బు తమ వద్ద ఉన్నట్టు ఒప్పుకుంటే వారికి పన్ను మినహాయింపులు సహా అనేక అంశాల్లో రాయితీలు ఇచ్చేలా ప్రభుత్వం 1986 బడ్జెట్ లో కీలకమైన నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు చేపట్టింది. నల్లధనంపై కఠిన చట్టాలు ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టారు. ట్యాక్స్ శ్లాబు(Tax slab)లను సరళీకరించారు. ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా నాడు దీనిని క్యారెట్-కర్ర బడ్జెట్‌గా అభివర్ణించేవారు. నల్లధనంపై తప్పు ఒప్పుకుంటే తాయిళాలు ఇవ్వడం ఒప్పుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మన్మోహన్ బడ్జెట్ (Manmohan Singh Budget) (1991)

ప్రధానమంత్రి పీవీ నరసింహారావు (PV Narasimha Rao)నేతృత్వంలో ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh Budget) 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశస్థితిగతులను ఒక్కసారిగా మార్చివేసిందని చెప్పవచ్చు. విదేశీ పెట్టుబడులు, దిగుమతులకు దేశం తలుపులు బార్లా తెరిచారు. అప్పటివరకు ఉన్న లైసెన్స్ రాజ్ ను ఒక్క సంతకంతో పాతాళానికి తొక్కేశారు. ఏ దేశమైనా స్వేచ్ఛగా దేశంలో వాణిజ్యం చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. అప్పటివరకు 220శాతం ఉన్న దిగుమతులను పన్నును ఒక్కసారిగా 150శాతానికి తగ్గించేశారు. ఈ నిర్ణయాలే దేశంలో సరళీకరణకు మార్గం సుగమం చేశాయి.

కలల బడ్జెట్ (1997)

సగటు భారతీయుడు బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకుంటాడు. ఏయే రంగాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.. ముఖ్యంగా ఉద్యోగులు ఆదాయపన్ను తగ్గిస్తారా? అని ఎదురుచూస్తుంటారు. 1997లో ఆర్థిక మంత్రి పీ చిదంబరం(Chidambaram) ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నాడు అందరూ కలల బడ్జెట్ గా అభివర్ణించారు. ఇందులో పన్ను శ్లాబులు 30 నుంచి 40శాతం తగ్గించారు. దీంతోపాటు పలు సుంకాలు కూడా రద్దు చేయడంతో జనాకర్షక బడ్జెట్లలో ఒకటిగా నిలిచింది.

మిల్లీనియం బడ్జెట్(Millennium Budget) (2000)

పేరుకు తగినట్టుగానే ఈ బడ్జెట్ లో సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల(Software products)పై భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. అప్పటివరకు సీడీలు సహా అనేక కంప్యూటర్ వినిమయ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు ఉండేవి.. వాటిని చాలావరకు తగ్గిస్తూ వాజ్ పేయ్(Atal Bihari Vajpayee) సారథ్యంలోని ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) నిర్ణయాలు తీసుకున్నారు. ఇదికూడా దేశంలో సాఫ్ట్ వేర్ రంగం(Software sector) అభివృద్ధికి కీలక ముందడుగుగా మారింది.

డిజిటల్ ఇండియా (Digital India)(2016)

నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వం డిజిటల్ ఇండియా(Digital India) నినాదాన్ని 2016 బడ్జెట్ లో ప్రకటించింది. ఈ బడ్జెట్ లోనే జన్ ధన్ ఖాతాలు ఆధార్ తోపాటు మొబైల్ నంబర్ లింకు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకే చేరేలా ప్రతి ఒక్కరికీ రూపాయి లేకుండా బ్యాంకు ఖాతాలు తెరిచారు. లబ్ధిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సబ్సిడీ చేరేలా నిర్ణయాలు తీసుకున్నారు. జన్ ధన్ యోజన(Jan Dhan Yojana)తో దాదాపు 20కోట్లమంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆధార్ తో ఖాతాలను లింక్ చేయడం ఒకరికి ఒకటి కంటే ఎక్కువ సబ్సిడీ అందకుండా అడ్డుకున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లు(Digital transactions) పెరిగేందుకు ఈ బడ్జెట్ మార్గం సుగమం చేసింది.

పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) (2019)

ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) 2019లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. చిన్న రైతులకు ఏటా రూ.6వేలు అందించాలని నిర్ణయిస్తూ.. పీఎం కిసాన్ పథకాన్ని(PM Kisan Yojana) అనౌన్స్ చేశారు. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని రూ.5లక్షలు పెంచారు. ఫలితంగా దాదాపు 3కోట్లమంది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించింది.

Next Story