- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిగూడెంలో జోరుగా సాగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణ
ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు నడిగూడెం లో క్రమంగా ప్రైవేటు వ్యక్తుల అక్రమణలకు గురవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, నడిగూడెం: ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు నడిగూడెం లో క్రమంగా ప్రైవేటు వ్యక్తుల అక్రమణలకు గురవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు, రహదారి మార్జిన్‌లు, ప్రజా వినియోగానికి ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు వెలుస్తుండగా, సంబంధిత శాఖలు మాత్రం మౌనం వీడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆస్తులు కొందరికి కాసుల కురిపించే ఆదాయ వనరులుగా మారుతున్నా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం చుక్కెదురు కావడం గమనార్హం.
ప్రభుత్వ స్థలాలలో దుకాణాల దందా..
మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో గల ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా వినియోగించుకుని ప్రైవేటు వ్యక్తులు ప్రతి నెలా వేలాది రూపాయలు అద్దెల రూపంలో ఆదాయం పొందుతుండగా, గ్రామపంచాయతీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఒక్క రూపాయి ఆదాయం రావడం లేదు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి క్షేత్రస్థాయి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
బాలికల విద్యా సంస్థల వద్ద ఆందోళనకర పరిస్థితి..
సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రహరీకి ఆనుకుని నిర్మించిన అక్రమ కట్టడాలు విద్యార్థినుల భద్రత పై ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాల పరిసరాల్లో అనవసర రద్దీ పెరగడంతోపాటు విద్యాసంస్థ ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మార్గాన్ని ఉపయోగించే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఇదే అంశంపై ప్రజావాణి (గ్రీవెన్స్)లో జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామ పంచాయతీ అధికారులు కేవలం దుకాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బస్టాండ్ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి..
నడిగూడెం బస్టాండ్ సెంటర్‌లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. రహదారి మార్జిన్‌తోపాటు బస్టాండ్ ఆవరణలో సైతం అక్రమంగా దుకాణాలు, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, బస్సుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. ప్రజల కోసం ఉద్దేశించిన బస్టాండ్ ఆవరణ క్రమంగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నా చర్యలు లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, గ్రామపంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






