కొలువు రాదాయే.. నిరుద్యోగులకు ‘చావే శరణ్యమా’..?

by  |
jobs
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు ఉసురు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 2 నాటికి రాష్ట్రంలో 14 మంది ఉన్నత విద్యావంతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏండ్ల తరబడి చదివి, పీజీలు, డాక్టరేట్లు పొంది సరస్వతిని జయించిన విద్యావంతులు… ఉద్యోగం వేటలో పరాజయం పాలయ్యారు. అటు ప్రభుత్వం నుంచి నోటీఫికేషన్లు రాకపోవడం, ఇటు ప్రైవేట్​గా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో తనువు చాలిస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని, జాబ్​ లెటర్​తోనే ఇంటికి వెళ్తామని చూసిన నిరుద్యోగులు ఇంటికి ఉత్తిచేతులతో తిరిగి వెళ్లలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఏండ్ల నుంచి అష్టకష్టాలు పడుతూ పెంచిన తల్లిదండ్రుల దగ్గరకు ఎలాంటి ఉద్యోగం లేకుండా వెళ్లలేమంటూ యూనివర్సిటీల్లో ఉంటున్న వారు ఇప్పుడు భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ చదువు మారుతుండటం, కొత్త సంస్కరణలు వస్తుండటంతో దిగులు పడుతున్నారు. ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆందోళన కల్గిస్తున్నాయి. మరోవైపు నిరుద్యోగ పోరాటానికి ప్రతిపక్షాలు దిగుతున్నా ప్రభుత్వం మాత్రం ఉన్న ఉద్యోగుల సర్దుబాటులోనే కాలం వెళ్లదీస్తోంది. ఫలితంగా

8 నెలలు.. నాలుగు ఎన్నికలు..

గత ఏడాది డిసెంబర్​లో ఢిల్లీకి వెళ్లిన వచ్చిన సీఎం కేసీఆర్​… అదే నెల 13న రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దాదాపుగా ఏడేండ్ల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటన జీవం పోసింది. దీంతో మళ్లీ లైబ్రరీలకు తరిలారు. సీఎం ప్రకటన తర్వాత గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గ్రేటర్​లో గెలిచారు. అనంతరం మండలి ఎన్నికల్లో ఉద్యోగాల భర్తీ అంశంపైనే పట్టభద్రులైన నిరుద్యోగులకు వల వేశారు. అక్కడా బయటపడ్డారు. ఆ తర్వాత నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక రాగా.. అక్కడా అంతే. ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా హుజురాబాద్​ ఉప ఎన్నిక. ఇంకా షెడ్యూల్​ రాకున్నా 50వేలు, 60 వేల ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వం లీకులిస్తోంది.

ఖాళీలు తేల్చడంలోనే కాలం వెళ్లదీస్తున్నారు..

డిసెంబర్​లో మొదలుపెట్టిన ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే క్లారిటీ రావడం లేదు. ముందుగా 45 వేలు, ఆ తర్వాత 56 వేలు… ఇప్పుడు 60 వేల ఖాళీలు ఉన్నాయంటూ ప్రభుత్వాధికారులు నివేదికలు ఇస్తున్నారు. కేసీఆర్​ ప్లాన్​లో భాగంగానే ఇలా నివేదికల పేరుతోనే కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పీఆర్సీ నివేదిక 1.91 లక్షల ఖాళీలను చూపించింది. కానీ ప్రభుత్వం 60 వేలు దాటనీయడం లేదు. నిరుద్యోగ జేఏసీ 2.93 వేల ఖాళీలున్నాయని చెప్పుతున్నారు. అటు ప్రభుత్వం నుంచి ఇంకా తేల్చకపోవడంపై నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగం వస్తుందా..?

ఏండ్ల తరబడి ఇండ్లను విడిచిపెట్టి, యూనివర్సిటీల్లో కాలం వెళ్లదీస్తున్న నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందా లేదా అను అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంటికి వెళ్లి కూలీ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ చావును వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 2 నాటికి 14 మంది పట్టభద్రులైన నిరుద్యోగులు ఊపిరి తీసుకున్నారు. తల్లిదండ్రుల దగ్గర వెళ్లి వారికి భారం కాలేమంటూ ప్రాణాలు వదులుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారనే విషయాలను చెప్పి మరీ చచ్చిపోతున్నారు.

మరోవైపు ఏజ్​బారు అవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో, కోచింగ్ సెంటర్లలో ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో చాలా మంది గడిచిన మూడేండ్లలో ఏజ్ బార్ కు దగ్గరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తాము విలువైన సమయాన్ని వృధా చేసుకున్నామని, జాబ్ నోటిఫికేషన్లలో తమకు వయోపరిమితి పెంచాలని విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేయడంతో పదేండ్ల సడలింపు ఇస్తూ 2015 ఆగస్టులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్క ఏడాది మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. అయితే ఆ సంవత్సరం పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరో ఏడాది పొడిగించింది. ఆ తర్వాత కొన్ని జాబ్ నోటిఫికేషన్లు విడుదలైనా కోర్టు కేసులు, ఇతర కారణాలతో జాప్యం కావడంతో వయో పరిమితి సడలింపు నిర్ణయాన్ని మరో ఏడాది పొడిగించింది.

ఆ తర్వాత నిరుద్యోగుల డిమాండ్ మేరకు 2017 ఆగస్టు 8న ఏజ్ లిమిట్ పై జీవో నంబర్ 190 జారీ చేసింది. ఈ జీవో వ్యాలిడిటీ 2‌‌019, జూలై 26తో ముగిసింది. గత మూడేండ్లలో జాబ్ నోటిఫికేషన్లు జారీకాకపోవడంతో వయో పరిమితిని సడలించాలనే డిమాండ్ వస్తోంది. అయితే సీఎం కేసీఆరే స్వయంగా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం, ఇటీవల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్​లో వయో పరిమితి సడలింపు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏజ్ లిమిట్ ను పెంచాలని, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలంటున్నారు.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు (ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి )

1). సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలో మహేందర్ యాదవ్ అనే బీటెక్ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు.
2). మహబూబాబాద్ జిల్లా రాంసింగ్ తండాకు చెందిన కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ బోడ సునీల్ నాయక్ సూసైడ్​ రాష్ట్రంలో కలకలం రేపింది. ఖాళీలను భర్తీ చేయడం లేదని మనోవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగాడు.
3). ఉస్మానియా యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్ లో పీహెచ్​డీ పూర్తి చేసిన నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
4). ఇంగ్లీష్ స్కాలర్ రవీందర్ నాయక్ ఉప్పల్​లో ఉరి వేసుకున్నాడు.
5). ఓయూ పీజీ స్టూడెంట్ మురళీ ముదిరాజ్,
6). ఓయూ స్టూడెంట్​ కొప్పు రాజు బలన్మరణానికి పాల్పడ్డారు.
7). సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లెకు చెందిన ఉప్పు రాజు ఉరేసుకుని చనిపోయాడు.
8). వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తికి చెందిన కాల్వ శ్రీనాథ్(25) బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూసి నోటిఫికేషన్లు ఎంతకూ రాకపోవడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.
9). మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని సెరిల్లాకు చెందిన కొట్టముల వెంకటేశ్ (23) టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో ఉరేసుకుని చనిపోయాడు.
10). వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
11). నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
12). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన నాగేశ్వర్​రావు అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ​
13) సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారానికి చెందిన నీలకంఠ సాయి నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు.
14). తాజాగా హుజురాబాద్​ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మహ్మద్​ షబ్బీర్​ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

హుజురాబాద్​ నుంచే నిరుద్యోగ బంధు ప్రకటించాలి..

హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం దళిత బంధు ఎలా ఇస్తున్నారో.. అక్కడి నుంచే నిరుద్యోగ బంధు ప్రకటించారు. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని గతేడాది డిసెంబర్‌లో ప్రకటించారు. ఇప్పటికీ దాన్ని అమలుచేయడంలేదు. గ్రేటర్​, ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజూర్ నగర్‌ ఉపఎన్నిక రావడంతో వాటి తర్వాత నోటిఫికేషన్ ఉంటుందనుకున్నాం. కానీ ఆ ఎన్నికలు ముగిసి నెలలు గడిచాయి. కానీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్​ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఉద్యోగాల భర్తీ పట్టించుకోరు. ఖాళీల వివరాలు అసమగ్రంగా ఉన్నాయన్న కారణంతో సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ బంధు కింద నిరుద్యోగులకు రూ. 5లక్షలు ఇవ్వాలి. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. 30 లక్షలు, మూడెకరాల భూమి, డబుల్​ బెడ్​ రూం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

-వడత్య భీంరావు నాయక్, రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్​

ఇంకెప్పుడు ఉద్యోగాలిస్తారు..

ఏడేండ్ల నుంచి సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. జేఎల్​, డీఎల్​, గ్రూప్​ –1 నోటిఫికేషన్లు అసలే లేవు. ఉద్యోగాల కోసం ఎదురుచూసి బతుకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఖాళీలున్నట్లు తేల్చారు. వాటి ప్రకారమైన ఉద్యోగాల భర్తీ చేయాలి.

-అశోక్​, లంబాడీ స్టూడెంట్​ఆర్గనైజేషన్​


Next Story

Most Viewed