పెళ్లైనా చేయండి.. ప్రభుత్వ ఉద్యోగమైనా ఇప్పించండి?

59

దిశ, వెబ్‌డెస్క్ : నేటి సమాజంలో అబ్బాయిలకు ప్రభుత్వ ఉద్యోగంతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎన్నో ఏండ్లు పుస్తకాలతో కుస్తీలు పడితే గానీ ప్రభుత్వం ఉద్యోగం రావడం లేదు. ఒకవేళ కష్టపడినా వస్తుందన్న గ్యారంటీ లేదు. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో చాలా మంది ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు.

మరోవైపు కుటుంబానికి అండగా ఉండేందుకు కొందరు ప్రిపరేషన్ చేస్తూనే చిన్నచితకా పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలాఉంటే వయస్సు మీద పడుతున్న అబ్బాయిలకు పెళ్లి చేయాలని ఆలోచించే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా అమ్మాయి తరఫు వారు ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడుగటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పలుమార్లు ఎదురవడంతో మహారాష్ట్రలోని వసిం ప్రాంతానికి గజానన్ రాథోడ్ అనే వ్యక్తి విసుగుచెందాడు.

‘తనకు ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేయండి? లేక ప్రభుత్వం ఉద్యోగం అయినా ఇప్పించడంటూ’.. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు లేఖ రాశాడు. అంతేకాకుండా తాను ఏడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నానని.. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతిసారీ ప్రభుత్వ ఉద్యోగం అడుగుతున్నారంటూ లేఖలో వాపోయాడు. ఇదిలాఉండగా, మరికొందరైతే సరైన జాబ్ లేక పెళ్లి చేసుకోవడానికి కూడా అయిష్టత కనబరుస్తారని తెలుస్తోంది.