కాంగ్రెస్ పార్టీ మోసాలు, అబద్ధాలకు ప్రతీక: మాజీ మంత్రి తలసాని

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ మోసాలు, అబద్ధాలకు ప్రతీకగా మారిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ ​యాదవ్​ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మోసాలు, అబద్ధాలకు ప్రతీక: మాజీ మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ మోసాలు, అబద్ధాలకు ప్రతీకగా మారిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ ​యాదవ్​ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గులాబీ జెండా పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచిందని, పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అధ్యక్షతన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశాని ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.

పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కష్టపడి పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం, గౌరవం, గుర్తింపు లభిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఏ ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానేనని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Next Story