- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ నాయకత్వమే.. తెలంగాణకుశ్రీరామరక్ష..!
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని.. బీఆర్ఎస్ సభ్యత్వాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మోర్తాడ్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని.. బీఆర్ఎస్ సభ్యత్వాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ లలిత గార్డెన్ లో జరిగిన సభ్యత్వ నమోదు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతులు కేవలం ఒక ఫోన్ కాల్‌తో యూరియా వారి పొలం లోకి చేరేదని , నేడు కాంగ్రెస్ తెచ్చిన సరికొత్త 'యాప్' నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయని ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ యాప్ వల్ల రైతులు మీ-సేవ కేంద్రాల చుట్టూ, అధికారుల చుట్టూ వారాల తరబడి తిరగాల్సి వస్తోందన్నారు. ఒక రైతు 20 సంచుల ధాన్యం అమ్మాలనుకుంటే, ఒకేసారి కాకుండా దఫదఫాలుగా నాలుగేసి సంచుల చొప్పున యాప్‌లో అనుమతి ఇస్తున్నారని, దీనివల్ల రైతు ఐదుసార్లు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ఈ అనాలోచిత నిర్ణయాలతో రైతులపై ఏమాత్రం అవగాహన, ప్రేమ లేని ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిపోయిందన్నారు.
రైతులను ఇబ్బంది పెడుతున్న 'యాప్' నిబంధనలను తక్షణమే రద్దు చేయాలనీ వచ్చిన కార్యకర్తల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ఆ నాడు రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేశారని కొనియాడారు. కేసీఆర్ గారి హయాంలో రైతులు ఎంతో ధీమాగా పంటలు పండించుకున్నారని, నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయానికి కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
"రైతులకు 3 గంటలు, 11 గంటలు లేదా 14 గంటల కరెంట్ ఏమాత్రం సరిపోదు. పంటలు సముచితంగా పండాలంటే గతంలో మాదిరిగా 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్ పునరుద్దరించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. మూడు గంటల విద్యుత్ ప్రకటనతో రైతుల పొట్ట కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు బాల్కొండ నియోజకవర్గంలో పసుపు సాగు చేసే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం పసుపు పంటల సాగు సమయం మరియు విత్తనాల సీజన్ ప్రారంభమైనందున రైతుల విద్యుత్ అవసరాలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వం ప్రతీకార ధోరణి వీడి సరిపడా విద్యత్ అందజేయాలనీ డిమాండ్ చేస్తూ నాయకుల మద్దతుతో తీర్మానం చేసారు. రైతుల సమస్యలపై అసెంబ్లీ లోపలా, వెలుపలా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవల నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆందోళన కలిగించాయని అన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో క్వింటాల్‌కు 10 నుంచి 12 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, సంచులు, లారీల కోసం రైతులే ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ విధానాలను కారణంగా చూపడం సరైన కాదని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ ఇదే కేంద్ర విధానం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి విద్యుత్ శాఖను విభజించి రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ సరఫరాను దెబ్బతీయాలని చూస్తున్నాయని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాల ఆదాయంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. ప్రస్తుతం లాభదాయక విభాగాలను ప్రైవేటుకు అప్పగించి, వ్యవసాయ రంగాన్ని మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంచే కుట్ర జరుగుతోందని విమర్శించారు. దీంతో భవిష్యత్తులో రైతులు విద్యుత్ అందకుండా ఉండే ప్రమాదం ఉందన్నారు.దేశం, ధర్మం పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుల, రైతుల జేబులు గుల్ల చేస్తోందని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. ఉప్పు, పప్పు, టమాటా, ఉల్లిపాయలతో సహా నిత్యావసరాల ధరలన్నీ పెంచి సామాన్యుడి నడుం విరిచారని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతూ, పేద ప్రజల రక్తాన్ని పిండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా దగా అని శ్రీ ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జ్ విజి గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జజాలా సురేందర్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ దావ వసంత, రాజారామ్ యాదవ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






