- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక దందా సాగితే సహించేది లేదు: మంత్రి వివేక్
రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యత, ఆదాయం, ఆదాయ వృద్ధికి ఉన్న అవకాశాలు, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, వ్యవస్థలో తీసుకురావాల్సిన మెరుగుదలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని కార్యకలాపాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. లారీల కదలికలను నిరంతరం పర్యవేక్షించే బలమైన నిఘా వ్యవస్థ ద్వారా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీజీఎండీసీ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి శాఖ చేపడుతున్న ఆదాయ వృద్ధి చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం, అక్రమ మైనింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి మంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక ఖనిజాలు, ఇతర ఖనిజాల అన్వేషణకు సంబంధించి కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి నివేదిక సమర్పించారు. అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రాధాన్యత గల అంశాలపై సమగ్ర నివేదికలను అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాండ్ బజార్ల పనితీరు, శాఖ నిఘా వ్యవస్థ, సిబ్బంది అవసరాలపై ఆరా తీశారు. రాష్ట్ర ఖనిజ వనరుల సమర్థ నిర్వహణ కోసం అమలు వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి వివేక్ సూచించారు.






