- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్
ఈ నేపథ్యంలో గూగుల్ ఎల్‌ఎల్‌సి హిండ్‌వేర్‌కు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ యాడ్స్ వ్యాపారంలో గూగుల్ అనుసరిస్తున్న కీవర్డ్ యాడ్స్ విధానంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శానిటరీవేర్ తయారీ సంస్థ హిండ్‌వేర్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసులో, గూగుల్ తన యాడ్‌వర్డ్స్ (ప్రస్తుతం గూగుల్ యాడ్స్) వ్యవస్థ ద్వారా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లను కీవర్డ్‌లుగా ఉపయోగించేందుకు అనుమతించడం వల్ల ఉల్లంఘనకు దారితీసిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఎల్‌ఎల్‌సి హిండ్‌వేర్‌కు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం, వినియోగదారులు ‘హిండ్‌వేర్ శానిటరీ’, ‘హిండ్‌వేర్ శానిటరీ వేర్’ వంటి పదాలతో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, పోటీ కంపెనీల ప్రకటనలు ముందుగా కనిపించేలా గూగుల్ యాడ్స్ సిస్టమ్‌లో ఆ బ్రాండ్ పేర్లను కీవర్డ్‌లుగా కొనుగోలు చేసినట్లు హిండ్‌వేర్ ఆరోపించింది. దీనివల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా, హిండ్‌వేర్ బ్రాండ్ విలువను ఇతర కంపెనీలు వాణిజ్యపరంగా ఉపయోగించుకున్నాయని సంస్థ వాదించింది.
ఈ కేసులో గూగుల్ కేవలం యాడ్స్ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదని కోర్టు అభిప్రాయపడింది. ఒక కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కీవర్డ్‌గా ఎంచుకుని యాడ్స్ ఇవ్వడానికి గూగుల్ స్వయంగా సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆ ప్రక్రియ ద్వారా ఆదాయం కూడా పొందుతోందని పేర్కొంది. అందువల్ల ట్రేడ్‌మార్క్ వినియోగంలో గూగుల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని కోర్టు తేల్చింది. ఈ కారణంగా, 'మేము కేవలం మధ్యవర్తులం' అని చెప్పి చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది.
డిజిటల్ యాడ్స్ రంగంలో ఈ తీర్పు ఒక కీలక మైలురాయిగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు. ఒక సంస్థకు చెందిన రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను అనుమతి లేకుండా పోటీదారులకు ప్రకటనల కీవర్డ్‌గా విక్రయించడం వ్యాపార నైతికతలకు, ట్రేడ్‌మార్క్ హక్కులకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఆన్‌లైన్ యాడ్స్ ప్లాట్‌ఫామ్‌లు, బ్రాండ్ పేర్ల వినియోగంపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు స్పష్టంగా సూచిస్తోంది.






