- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమే : జాన్ వెస్లీ
సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు, దోపిడీ కొనసాగుతున్నంత కాలం కమ్యూనిజం సజీవంగానే ఉంటుందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

దిశ, ఖైరతాబాద్ : సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు, దోపిడీ కొనసాగుతున్నంత కాలం కమ్యూనిజం సజీవంగానే ఉంటుందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై అధ్యయనం పెరుగుతోందని, కార్ల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్ వంటి గ్రంథాలను చదివే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీపీఐ(ఎం) గ్రామస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందని, వచ్చే మూడు నెలల పాటు గ్రామాలు, బస్తీల్లో విస్తృత పర్యటనలు చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. మతం, కులం, ప్రాంతం, డబ్బు, ప్రలోభాల రాజకీయాల కారణంగా కమ్యూనిస్టు పార్టీలకు శాసనసభల్లో ప్రాతినిధ్యం తగ్గినా, ప్రజల్లో ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయని, భవిష్యత్తులో వామపక్షాలు బలమైన ప్రజాశక్తిగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల తరువాత కూడా ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని జాన్ వెస్లీ విమర్శించారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రాలేదన్నారు. చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు నీరు అందేదని అభిప్రాయపడ్డారు. భారీ ప్రాజెక్టులు పాలక వర్గాలకు ‘ఏటీఎంలు’గా మారిపోయాయని ఆరోపించారు.రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ విద్యాలయాలు, కేంద్ర విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు.
పంటలు పండించిన రైతుల నుంచి కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నాయని అన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, పోడు రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని మరిచిపోయిందని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్నే నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతోందని ఆరోపించారు. రూ.12 నుంచి రూ.13 వేల వేతనాలతో లక్షలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందేలా దీర్ఘకాలిక పోరాటాలు చేపడతామని జాన్ వెస్లీ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ శాతం 82కి చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమితో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారని, అక్కడ ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది పేదలకు ఇండ్లు లేవని, వారికి ఇంటి స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. జర్నలిస్టులకు కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రకంగా లౌకిక భావజాలం కలిగిన ప్రాంతమని, మత సామరస్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ సంపదలో 40 శాతం కేవలం ఒక్క శాతం ప్రజల చేతుల్లోనే కేంద్రీకృతమైందని, మరోవైపు 50 శాతం మంది ప్రజలు కేవలం 3 శాతం సంపదతో జీవిస్తున్నారని జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు పెరిగే కొద్దీ ప్రజల్లో అసంతృప్తి, ప్రతిఘటన, తిరుగుబాటు భావాలు పెరగడం సహజమన్నారు. విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయని, వాటిని కప్పిపుచ్చేందుకు పాలక వర్గాలు మత, కుల, ప్రాంతీయ భావోద్వేగాలను ఉపయోగిస్తున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. కమ్యూనిజంపై అవగాహన లేకుండానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై ఆసక్తి, అధ్యయనం పెరుగుతోందని, అమెరికా వంటి దేశాల్లో కూడా వామపక్ష భావజాలం బలోపేతమవుతోందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని జాన్ వెస్లీ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు దీనిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు క్రమంగా బలహీనపడుతున్నాయని జాన్ వెస్లీ వ్యాఖ్యానించారు. మొదట భాగస్వామ్యంగా కనిపించినా, అనంతరం ఆ పార్టీలను నిర్వీర్యం చేసే రాజకీయ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రతిపక్షాల స్థలాన్ని కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.






